Delhi: కొనసాగుతోన్న బెంగాల్, అసోం తొలి విడత పోలింగ్
Delhi: పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.
Delhi: పశ్చిమ బెంగాల్, అసోం అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ కొనసాగుతోంది.బెంగాల్ శాసనసభలో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా... తొలి దశలో 30 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది. 30 స్థానాల్లో మొత్తం 191 మంది అభ్యర్థుల తమ జాతకాన్ని నిరూపించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈసీ గట్టి భద్రతా ఏర్పాట్లు చేసింది. బెంగాల్‌లో మొత్తం ఎనిమిది విడతల్లో ఎన్నికల ప్రక్రియ జరగనుంది. తొలి విడత పోలింగ్ కోసం 10,288 పోలింగ్ బూత్‌లను ఈసీ ఏర్పాటు చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు.
అస్సాంలో తొలి దశలో నేడు 47 స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 264 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. సీఎం సహా పలువురు ప్రముఖులు మొదటి దశ ఎన్నికల్లోనే బరిలో ఉన్నారు. పలు స్థానాల్లో అధికార భాజపా-ఏజీపీ కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాజోత్ కూటమి, ఏజేపీ-రైజొర్‌దళ్ కూటమి మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. తొలి దశ పోలింగ్ జరగనున్న స్థానాల్లో 81.09 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
ఓటు హక్కు కలిగిన ప్రతిఒక్కరూ వినియోగించుకుని తమ బాధ్యతను నిర్వర్తించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. పశ్చిమబెంగాల్, అసోం తొలి దశ ఎన్నికల సందర్భంగా.. ఆయన ఈ మేరకు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఓటర్లు పలు జాగ్రత్తలు తీసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.