India: భారత్ కు ఫైజర్ భారీ సాయం
India: కరోనాతో పోరాడుతున్న భారత్‌కు ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ భారీ సాయం ప్రకటించింది.
India: కరోనాతో అల్లాడిపోతున్న భారతదేశానికి ప్రపంచ దేశాల నుంచి పలు రూపాల్లో సాయం అందుతోంది. ఇప్పటికే అమెరికా, రష్యా, బ్రిటన్ దేశాలు ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందుల రూపంలో సాయం అందిస్తున్నారు. ఇప్పుడు ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ సైతం ముందుకొచ్చింది. 510 కోట్ల రూపాయల(7 కోట్ల డాలర్ల) విలువైన మందులను భారత్ పంపించనున్నట్లు ప్రకటించింది. అమెరికా, ఐరోపా, ఆసియాలోని సంస్థకు చెందిన పలు పంపిణీ కేంద్రాల నుంచి భారత్ కు ఈ ఔషధాలను అందించనున్నట్లు కంపెనీ సీఈఓ ఆల్బర్ట్ బోర్లా వెల్లడించారు.
భారత్ కు వీలైనంత త్వరగా తమ సాయం అందే దిశగా చర్యలు చేపడుతున్నామని భారత్ లోని ఫైజర్ ఉద్యోగులకు రాసిన లేఖ లో బోర్లా తెలిపారు. కంపెనీ చరిత్రలో అదే అతి పెద్ద విరాళమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుప్రతుల్లో న్న కోవిడ్ బాధితులందరికీ ఈ ఔషదాలు ఉచితంగా అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతోనే ఈ సాయాన్ని అందజేస్తున్నాం అని బోర్లా తెలిపారు. వీటిని అవసరమైన చోటుకు వీలైనంత త్వరగా చేర్చేందుకు భారత ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తామని వెల్లడించారు.
అలాగే బయో ఎన్ టెక్ తో కలసి ఫైజర్ రూపొందించిన కరోనా టీకా వినియోగానికి భారత్లో అనుమతులు లభించే విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు బోర్లా తెలిపారు. అనుమతి ప్రక్రియను వీలైనంత వేగవంతం చేయాలని కోరామని తెలిపారు. 'భారత్‌లో కరోనా పరిస్థితులు మమ్మల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇండియాలో ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నాం'అని ఫైజర్ ఇండియా ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో ఆల్బర్ట్ బోర్లా పేర్కొన్నారు.