5 రోజుల్లో టీకాలు మార్కెట్లోకి .. టీకా వేయించుకోవాలంటే ఆ పని చేయాల్సిందే
Corona Vaccine in India: మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవారందరూ టీకా వేయించుకోవడానికి అర్హులే.
Corona Vaccine in India: మరో ఐదు రోజుల్లో కరోనా టీకాలు మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. మే 1 నుంచి 18 ఏళ్లు దాటినవారందరూ టీకా వేయించుకోవడానికి అర్హులే. కానీ టీకా వేయించుకోవాలంటే కొవిన్ యాప్‌లో నమోదు చేసుకోవాల్సిందే. శనివారం నాటికి దేశవ్యాప్తంగా 12.21 కోట్ల డోసుల టీకాలు వేశారు. అందులో కేవలం 11.6 మాత్రమే రిజిస్ట్రేషన్ ద్వారా మిగతా 68 శాతం మంది నేరుగా టీకా కేంద్రాలకు వెళ్లి వేయించుకున్నవారే. అయితే కొద్దిరోజులుగా కొవిన్ యాప్‌లో నమోదు చేసుకున్నవారికి వారి స్లాట్ సమయానికి రెండు, మూడు గంటల ముందు మీ స్లాట్ రద్దు అయిందనే మెసేజ్ వస్తుందట.
స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా ఎవరైనా వచ్చి టీకా వేయించుకోవచ్చంటే దేశవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్ కేంద్రాలకు పోటెత్తే ప్రమాదం ఉంది. ఒకవేళ అదేగనుక జరిగితే ప్రభుత్వం వద్ద ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న టీకాలు సరిపోని పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల 1న కొవిన్ యాప్‌లో నమోదు చేసుకోవడానికి ప్రయత్నించినవారికి 10, 15 రోజుల తర్వాతో స్లాట్ దొరుకుతుంది. తద్వారా ప్రభుత్వానికి కొంత సమయం దొరుకుతుంది. ఏ రోజు ఎంత మందికి స్లాట్లు బుక్ అయ్యిందనే లెక్క ఆధారంగా అన్ని టీకాలను అందుబాటులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
వ్యాక్సిన్ నిల్వలను కేంద్రం హైజాక్ చేసిందని వ్యాక్సిన్ నిల్వలను తీసేసుకుని తమ గుప్పిట్లో ఉంచుకుంటోందని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆరోపిస్తున్నాయి. మే 1 నుంచి 18-45 ఏళ్ల వారందరికీ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించడం కష్టమేనని వాపోయాయి. నిల్వలన్నింటినీ కేంద్రమే లాక్కొంటే వ్యాక్సిన్ ఎలా అందజేయగలమని ప్రశ్నిస్తున్నాయి. తమ రాష్ట్రాలకు కావాల్సిన టీకాల కోసం సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ను సంప్రదిస్తే మే 15 వరకూ ఇవ్వలేమని, కేంద్రం ఇప్పటికే ఇచ్చిన ఆర్డర్ మేరకు కూడా టీకాలను ఇవ్వలేమని చెప్పిందన్నారు రాజస్థాన్ ఆరోగ్యశాఖ మంత్రి.
ఇదిలా ఉండగా 18-45 ఏళ్లవారికి టీకా వేయడానికి తగినట్టుగా మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలకు సూచించింది. కాగా 45 ఏళ్లు దాటినవారు మాత్రం ఎప్పటిలాగానే టీకా కేంద్రాలకు వెళ్లి స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా వ్యాక్సిన్ తీసుకోవచ్చు.