Parliament Meeting: ఇవాళ్టి నుంచి పార్లమెంట్ సమావేశాలు
Parliament Meeting: నేడు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
Parliament Meeting: పార్లమెంట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఈసారి రెండు విడతల్లో జరగనున్న బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే పార్లమెంట్ కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉండడంతో ఉభయ సభలకు చెందిన సభ్యులు విడివిడిగా కూర్చునే విధంగా ఏర్పాట్లు చేశారు. అలాగే మొదటి రెండు రోజులు జీరో అవర్, క్వశ్చన్ అవర్‌లు ఉండవు. ఎప్పటిలాగానే మొదటి సెషన్ రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం కానుంది.
సోమవారం ఉదయం 11 గంటలకు సెంట్రల్ హాల్లో ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రసంగించిన అరగంట తర్వాత లోక్‌సభ కార్యకలాపాలు ప్రారంభం కాగా రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమవుతాయి. మొదటి రోజు 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంటు ఉభయ సభల్లో అందజేస్తారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేయనున్నారు. అనంతరం బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే కోవిడ్ ఆంక్షలు కారణంగా రెండు రోజులు మినహా మిగతా రోజుల్లో లోక్‌సభ, రాజ్యసభలను రెండు షిఫ్ట్‌ల్లో నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. అంటే ఫిబ్రవరి 2 నుంచి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాజ్యసభ సమావేశం కానుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్‌సభ సమావేశం కానుంది.
ఇదిలా ఉండగా ఈసారి బడ్జెట్ సమావేశాల్లో పెగాసెస్ వ్యవహారం చర్చకు రానున్నట్టు తెలుస్తుంది. ఈ విషయంలో చర్చకు విపక్షాలు పట్టుబట్టనున్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికలున్నా ఐదు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర అంశం, పెగాసిస్ స్పైవేర్ వ్యవహారం వంటివి ఈసారి పార్లమెంటులో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రెండు అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టే అవకాశాలు ఉండగా, అధికార పక్షం సైతం సరైన వ్యూహరచనతో ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది.