రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Parliament Budget: తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ 2022-23 ఏడాదికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్.

Update: 2022-01-30 02:12 GMT

రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

Parliament Budget: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తారు. అనంతరం ఎకనమిక్ సర్వేను టేబుల్ చేస్తారు. అనంతరం ఫిబ్రవరి 1న ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ సభలో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెడతారు. ఉదయం 11 గంటలకు నిర్మల 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాన్ని ఆరంభిస్తారు.

ఇక.. తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం.. రెండోరోజు బడ్జెట్ ప్రతిపాదనలను దృష్టిలో పెట్టుకుని కీలకమైన జీరో అవర్, క్వశ్చన్ అవర్‌ను పార్లమెంట్ సెక్రెటేరియట్ రద్దు చేసింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రెండు రోజుల్లో ఈ రెండు సెషన్లను నిర్వహించట్లేదని వెల్లడించింది. ఫిబ్రవరి 2 నుంచి జీరో అవర్, క్వశ్చన్ అవర్‌ సెషన్లను పునరుద్ధరిస్తామని పేర్కొంది. తమ తమ నియోజకవర్గాలకు సంబంధించిన కీలక అంశాలను ప్రస్తావించదలిచిన సభ్యులకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వివరించింది.

 మరోవైపు.. కోవిడ్ కారణంగా ఈ ఏడాది కూడా పేపర్‌లెస్ బడ్జెట్‌ ప్రతిపాదనలు తెరమీదికి రానున్నాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఈ బడ్జెట్ కాపీలను యాప్‌లో అందుబాటులో ఉంచుతామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్స్‌పై స్మార్ట్‌ఫోన్లను వినియోగించే వారు ఈ యాప్‌ను ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సారి హల్వా సంప్రదాయానికి కేంద్ర ప్రభుత్వం బ్రేక్ వేసింది.  ఇదిలా ఉంటే.. బ్డజెట్ సమావేశాల్లో బీజేపీ సర్కార్‌ను ఇరుకున పెట్టేందుకు ఇప్పటికే విపక్షాలు వ్యూహాలను సిద్ధం చేశాయి. మరోసారి పెగాసస్ స్పైవేర్ అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తనుంది. అయితే, విపక్షాలను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సైతం సన్నద్ధమైంది. ఇటీవల ప్రధాని మోడీ పంజాబ్ పర్యాటనలో భద్రతా వైఫల్యాలపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేయనుంది.

 ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికల జరగనున్న నేపధ్యంలో బడ్జెట్‌లో కేటాయింపులపై ఆసక్తి నెలకొంది. బడ్జెట్‌లో పెండింగ్ ప్రాజెక్టుల నిధులు, సంక్షేమ పథకాల నిధుల విడుదల కేటాయింపులు జరిగే అవకాశం ఉంది. నిర్మల పద్దులో ప్రధానంగా వైద్యం, ఫార్మా, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పలు రంగాలకు మౌలిక వసతుల కల్పన, ఆదాయ పన్ను పరిమితిని పెంచడం.. కరోనా కారణంగా మధ్యతరగతి హోదా కోల్పోయిన 35 మిలియన్ల ప్రజలను ఆదుకునేందుకు కేటాయింపులుండాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల కరుణిస్తే కరోనా కష్టాల నుంచి సామాన్యుడు బయటపడే అవకాశం ఉంది.

Tags:    

Similar News