పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, దీక్షలకు నో ఛాన్స్.. వర్షాకాల సమావేశాలకు ముందు కీలక నిర్ణయం
Parliament: పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో కొన్ని పదాల వినియోగాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక ఉత్తర్వులను జారీ చేసింది.
Parliament: పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో కొన్ని పదాల వినియోగాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో కీలక ఉత్తర్వులను జారీ చేసింది. పార్లమెంట్‌లో ధర్నాలు, నిరాహార దీక్షలు, నిరసన ప్రదర్శనలు, మతపరమైన వేడుకలను నిర్వహించరాదంటూ రాజ్యసభ జనరల్ సెక్రటరీ పీసీ మోదీ ఉత్తర్వులు జారీ చేశారు. సభ్యులు అందుకు సహకరించాలని ఆయన కోరారు. పలు పదాలను నిషేధిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేసిన 24 గంటల్లోనే కొత్త ఉత్తర్వులు ఇవ్వడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాజా ఆదేశాలను సోషల్ మీడియాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ షేర్ చేశారు. విశ్వగురు నుంచి మరో కొత్త ఆయుధం వచ్చింది. ఇకపై ధర్నాలు నిషేధం అంటూ విరుచుకుపడ్డారు.
దేశంలో జరిగి తాజా పరిణామాలు, కేంద్ర ప్రభుత్వం తెచ్చే చట్టాలను నిరసిస్తూ పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో విపక్షాలు నిరసనలు చేపట్టేవి. రెండు సభల్లోనూ పోడియంలోకి దూసుకొచ్చి సభ్యులు నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శనతో సభా కార్యకలాపాలను అడ్డుకుంటారు. దీంతో పలుమార్లు సమావేశాలు వాయిదా పడేవి. అయితే తాజా ఉత్తర్వులతో పార్లమెంట్‌లోని ఉభయ సభల్లో నిరసనలు, ఆందోళనలకు తెరపడనున్నది. పార్లమెంట్‌లో నిరసనలు, ఆందోళనలను నిషేధించడం అంటే పౌరుల హక్కులను నిషేధించడమేనని ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ విపక్ష పార్టీలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. తాజా ఉత్తర్వులతో ప్రభుత్వం ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా పరిస్థితులు మారుతాయని పలువురు విపక్ష పార్టీల ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జుమ్లాజీవి, కోవిడ్ స్ప్రెడ్డర్, స్నూప్ గేట్, అనార్కిస్ట్, శకుని, డిక్టెటోరియల్, తానాషా, తానాషాహీ, జైచంద్, వినాశ్ పురుష్, ఖలిస్తానీ, ఖూన్ సే ఖేతీ, దోహరా చరిత్ర్, నికమ్మా, నౌటంకీ, బెహరీ సర్కార్, ఢిండోరా పీట్నా, బిట్రేడ్, కరప్ట్, డ్రామా, హిపొక్రసీ, ఇన్‌కాంపిటెంట్, బ్లడ్‌షెడ్, బ్లడీ, చీటెడ్, చెంచా, చెంచాగిరీ, ఐవాష్ పదాలను నిషేధించింది. ఒకవేళ ఎవరైనా వాడినా వాటిని రికార్డుల నుంచి తొలగిస్తారు. అయితే ఆయా పదాల నిషేధంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేంద్రం ప్రకటించిన అన్‌పార్లమెంట్ పదాల్లాగే మోడీ సర్కారు వ్యవహరిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. అందుకే ఆ పదాలను వాడరాదని మోడీ నిర్ణయించారని రాహుల్ గాంధీ సెటైరికల్‌గా స్పందించారు.