Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సర్వం సిద్ధం
Monsoon Session: రేపటి నుంచి ఆగస్ట్ 13 వరకు జరగనున్న సెషన్స్ * మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ తర్వాత తొలి సమావేశాలు
Monsoon Session: పార్లమెంట్ మాన్సూన్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఇవాళ అఖిలపక్ష భేటీ జరిగింది. పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రధాని మోడీ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా సభా కార్యకలాపాలు సజావుగా సాగేలా చూడాలని అధికారపక్షం అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసింది. సభలో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను మంత్రి ప్రహ్లాద్ జోషి అఖిలపక్ష నాయకులకు వివరించారు.
మరోవైపు.. ఈ సమావేశాల్లో దాదాపు 15బిల్లులను ఆమోదానికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వం దాదాపు అన్ని సమస్యలను చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అఖిలపక్షానికి తెలిపింది. ఇక అమల్లో ఉన్న ఆర్డినెన్స్‌లకు చట్టరూపం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. జనాభా నియంత్రణ బిల్లును సభలో ప్రవేశపెట్టడంతో పాటు విద్యుత్ బిల్లులను కూడా మరోసారి సభ ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా దేశంలో పెరుగుతున్న నిత్యావసర, ఇంధన ధరలు సహా కోవిడ్ సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొన్న తీరుపై ప్రభుత్వాన్ని కార్నర్ చేసేందుకు విపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో కరోనా విజృంభిస్తోన్న తరుణంలో ప్రభుత్వం సరిగా వ్యవహరించడం లేదంటూ కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ ఫైర్ అవుతోంది. కొవిడ్, నిరుద్యోగం, చైనాతో సరిహద్దు వివాదం, రైతుల ఉద్యమం, రఫేల్ డీల్, ధరల పెరుగుదలతోపాటు ఆర్థిక పరిస్థితులపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది.
ఇటు ప్రాంతీయ పార్టీలు కూడా తమ సమస్యలను ప్రధానంగా లేవనెత్తనున్నాయి. ముఖ్యంగా కేంద్ర జల్‌శక్తి గెజిట్ నోటిఫికేషన్ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలతో పాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాంటి కీలక అంశాలను లేవనెత్తేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే ఆల్ పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న వైసీపీ ఎంపీ విజమసాయిరెడ్డి.. విభజన చట్టంలోని అంశాల అమలు విషయంలో జరుగుతున్న జాప్యం గురించి ఆల్ పార్టీ మీటింగ్‌లో ప్రస్తావించినట్లు తెలిపారు.
ఇక.. ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి అఖిలపక్ష సమావేశానికి హాజరైన కనకమేడల సోలవరం నిధులు, రాజధాని అమరావతి కోసం నిధుల గురించి ప్రస్తావించినట్లు తెలిపారు. అలాగే, కోవిడ్ థర్డ్‌వేవ్ నేపధ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే, రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి కూడా ప్రస్తవించినట్లు తెలిపారు.
మరోవైపు ప్రధాని మోడీ మంత్రులకు ఇప్పటికే కీలక సూచనలు చేశారు. విపక్షాల ప్రశ్నలకు ధీటుగా జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇదే సమయంలో దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోన్న వేళ అన్ని పార్టీలు ప్రజలపక్షాన నిలవాలని.. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన అన్ని సమస్యలపై ప్రశాంత వాతావరణంలో చర్చ జరిగేలా చూడాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు.