Parliament: ఉభయ సభల్లోనూ మరోసారి పెగాసస్ స్పైవేర్ రచ్చ
Parliament: పార్లమెంట్ ఉభయ సభల్లో మళ్లీ అదే రచ్చ ఇవాళ ఇంకాస్త సీరియస్‌గానే విపక్షాలు అధికార బీజేపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నించాయి.
Parliament: పార్లమెంట్ ఉభయ సభల్లో మళ్లీ అదే రచ్చ ఇవాళ ఇంకాస్త సీరియస్‌గానే విపక్షాలు అధికార బీజేపీని కార్నర్ చేసేందుకు ప్రయత్నించాయి. పెగాసస్‌పై చర్చ జరగాల్సిందే తగ్గేదే లేదంటూ విపక్ష సభ్యులు జోరుగా నినాదాలు చేశారు. లోక్‌సభలో ఈ నినాదాలు ఇవాళ మరింత తీవ్రంగా వినిపించాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు స్పీకర్ ఛైర్‌పైకి పేపర్లు విసరడం సభలో ఉద్రిక్తతలకు దారితీసింది.
పార్లమెంట్ ఉభయసభలనూ పెగాసస్ స్పైవేర్ మరోసారి కుదిపేసింది. ఫోన్ హ్యాకింగ్‌పై చర్చ జరగాల్సిదే అన్న నినాదాలతో ఉభయసభలూ దద్దరిల్లాయి. ఈ అంశంపై చర్చకు పట్టుబట్టిన విపక్ష ఎంపీలు సభ కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ప్లకార్డులు చేతబట్టి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. లోక్‌సభలో అయితే కాంగ్రెస్ ఎంపీలు పేపర్లు చించి స్పీకర్ ఛైర్‌పైకి విసిరారు. దీంతో ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు పదేపదే వాయిదా పడ్డాయి.
ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష పార్టీల సభ్యులు నిరసనలకు దిగారు. స్పీకర్ పోడియం దగ్గరకు వెళ్లి ప్లకార్డులతో నినాదాలు చేశారు. నేతల ఆందోళనలు కొనసాగుతుండగానే సభాపతి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నినాదాలను మరింత ఉధృతం చేశారు. కొందరు కాంగ్రెస్ ఎంపీలు పేపర్లు చించేసి స్పీకర్ ఛైర్, ట్రెజరీ బెంచ్‌లపైకి విసిరేశారు. దీంతో స్పీకర్ విపక్ష సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోడియంపై కాగితాలు విసిరినందుకు చర్యలు తీసుకున్న సభాపతి 10 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.
అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళ పరిస్థితులు కనిపించాయి. విపక్షాల నిరసనలతో సభ ప్రారంభమైన కొద్దిసేటికే వాయిదా పడింది. అనంతరం 12గంటలకు తిరిగి ప్రారంభమైన వెంటనే విపక్ష ఎంపీలు సీట్ల నుంచి లేచి ఆందోళన చేపట్టారు. పెగాసస్‌పై చర్చ జరపాలంటూ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో ఉభయ సభలూ మరోసారి వాయిదా మంత్రాన్నే జపించాయి.