నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
రేపు మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
Parliament Budget Meetings: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. గురువారం మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడతారు. మొదటి రెండు రోజుల తరువాత, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానంపై ఉభయ సభల్లో చర్చలు ప్రారంభమవుతాయి. ఆ తరువాత బడ్జెట్‌పై చర్చలు జరుగుతాయి. ఇది ఓట్ ఆన్ అకౌంట్ అవుతుంది.
ఫిబ్రవరి 9న ఈ సెషన్ ముగుస్తుంది.ఎంపిల సస్పెన్షన్ ఎత్తివేతప్రివిలేజ్ కమిటీకి సూచించిన 14 మంది ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌ను ఎత్తివేసినట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. అఖిలపక్ష సమావేశ అనంతరం మీడియాతో ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఎంపిల సస్పెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతిపక్ష సభ్యులందరి సస్పెన్షన్‌లను ఉపసంహరించుకోవాలని కోరుతూ.. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన ప్రివిలేజెస్ కమిటీలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపిందని చెప్పారు. నిర్మాణాత్మక చర్చలకు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే ఎంపిల సస్పెన్షన్‌ను రద్దు చేయాలని కోరామని చెప్పారు. బడ్జెట్ సెషన్ సమర్థవంతంగా సాగడంలో పార్లమెంటు సభ్యుల మధ్య చర్చలు, సహకారం ప్రధానమని తెలిపారు. ఈ సమావేశాలకు ప్రతిపక్షాలు సహకరించాలని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పారు.
ఎన్నికలకు ముందు మోదీ సర్కారు ఎలాంటి మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే చివరి పార్లమెంట్ సమావేశాలకు అధికార, విపక్షాలు అస్త్రశస్త్రాలతో సన్నద్ధం అవుతున్నాయి. 17వ లోక్ సభకు చివరి సమావేశాలు ఇవే కాబట్టి విపక్షాలు సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దని ప్రభుత్వం సూచించింది. బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని అఖిలపక్ష సమావేశంలో కేంద్రం స్పష్టం చేయగా- దేశంలో అప్రకటిత నియంతృత్వం నడుస్తోందని విపక్షాలు ఎదురుదాడికి దిగాయి.
ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు అవసరమయ్యే వ్యయాలను దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ పెడతారు. ఎన్నికల తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుంది. మధ్యంతర బడ్జెట్లో కొత్త పథకాలు, పన్నుల్లో మార్పులు ఉండకపోవచ్చని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే, మధ్యంతర బడ్జెట్లోనూ కీలక ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో నిర్మలమ్మ పద్దుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈసారి ప్రవేశపెట్టే బడ్జెట్ నిర్మలా సీతారామన్‌కు ఆరోది కానుంది.