Oxygen Shortage: రాష్ట్రాలను వేధిస్తున్న ఆక్సిజన్ కొరత

Oxygen Shortage: అన్ని ఆసుపత్రుల్లో నిండుకున్న ఆక్సిజన్ నిల్వలు * ఆక్సిజన్ కోసం అల్లాడుతున్న కోవిడ్‌ పేషెంట్లు

Update: 2021-04-22 05:12 GMT

ఆక్సిజన్ (ఫైల్ ఫోటో)

Oxygen Shortage: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఆక్సిజన్‌ కొరతతో ఆగం అవుతున్నాయి. కరోనా బాధితులు అల్లాడిపోతున్నారు. ఏ ఆసుపత్రికి వెళ్లినా ప్రాణవాయువు దొరకడం లేదు. ఎక్కడికి వెళ్లినా ఖాళీ సిలెండర్లే కనిపిస్తున్నాయి. ఊపిరాడని పేషెంట్లు ఆక్సిజన్‌ కోసం వెంపర్లాడుతున్నారు. అడిగినంత డబ్బు ఇస్తామని, ఎలాగైనా ఆక్సిజన్‌ సిలిండర్లు సమకూర్చాలని డీలర్లను బతిమిలాడుతున్నారు. సరిపడా ఆక్సిజన్ లేక డాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందో అని కరోనా బాధితులు టెన్షన్‌ పడుతున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నిండుకుంటున్న ఆక్సిజన్ నిల్వలు ఊపిరాడకుండా చేస్తున్నాయి. గంట గడిస్తే చాలు కేసుల సంఖ్య పెరిగిపోతుంది. ఆక్సిజన్ అవసరం కూడా అంతకంతకు పెరిగిపోతోంది. ఆక్సిజన్ నిల్వలేమో నిండుకుంటున్నాయి. దీంతో ప్రాణవాయువు కోసం కరోనా రోగులు విలవిలాడుతున్నారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

సాధారణంగా జలల వాటాల కోసం రాష్ట్రాలు పొట్లాడుకోవడం చూసుంటాం. కానీ ఎన్నడూ లేనివిధంగా ఆక్సిజన్ ట్యాంకర్ల కోసం రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. తమ రాష్ట్రానికి వస్తున్న ఆక్సిజన్‌ ట్యాంకర్‌ను ఢిల్లీ ప్రభుత్వం లూటీ చేసిందని హరియాణా మంత్రి అనిల్‌ విజ్‌ ఆరోపించారు. ఇదే సమయంలో ఢిల్లీకి ఆక్సిజన్‌ ట్యాంకర్లు రాకుండా హరియాణా అడ్డుపడుతోందని ఢిల్లీ ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది. మరోవైపు తమ రాష్ట్ర కోటాను ప్రస్తుత 250 మెట్రిక్‌ టన్నుల నుంచి 325 మెట్రిక్‌ టన్నులకు పెంచాలని రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ డిమాండ్‌ చేస్తున్నారు.

అయితే అన్ని రాష్ట్రాలకు పుష్కలంగా ఆక్సిజన్‌ను పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. మరికొన్ని రోజులు 'ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల'ను నడపనున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. రోజుకు 7,500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుండగా, అందులో 6,600 మెట్రిక్‌ టన్నులను వివిధ రాష్ట్రాల ఆరోగ్య అవసరాల కోసం కేటాయించినట్టు వెల్లడించింది. మరోవైపు విదేశాల నుంచి 50వేల మెట్రిక్‌ టన్నుల మెడికల్‌ ఆక్సిజన్‌ దిగుమతి చేసుకునేందుకు కేంద్రం సన్నాహాలు మొదలుపెట్టింది.

Tags:    

Similar News