Oxygen: కొవిడ్‌ రోగులకు అత్యవసరంగా మారిన ఆక్సిజన్‌

Oxygen: తక్షణం ప్రాణవాయువు అందించాల్సి పరిస్థితులు * ఆక్సిజన్ కొరతను అధిగమించాలంటే ఏం చేయాలి..?

Update: 2021-04-24 02:56 GMT

ఆక్సిజన్ ట్యాంకులు (ఫైల్ ఇమేజ్)

Oxygen: కొవిడ్‌ రోగులకు చికిత్సలో మందులతో పాటు ఆక్సిజన్‌ అత్యవసరంగా మారింది..! రోగులు శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నా,... తక్షణం వారికి ప్రాణవాయువు అందించాల్సి వస్తోంది. అయితే ఈ ఆక్సిజన్ కొరతను అధిగమించాలంటే ఏం చేయాలి? దిగుమతులపై ఆధారపడటం తప్ప ప్రత్యామ్నాయ మార్గమే లేదా..? ప్రాణవాయువు కోసం పడిగాపులు కాస్తున్న ఈ తరుణంలో ఇలా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

గతంలో ఎన్నడూ చూడనంతగా పెను ముప్పును భారత్‌ ఎదుర్కొంటోంది. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సైతం సరిపడ ఆక్సిజన్‌ లభించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కేంద్రం చర్యలు ప్రారంభించింది. కరోనా 2.0 విజృంభణతో దేశవ్యాప్తంగా ప్రాణవాయువు కొరత ఏర్పడిన వేళ దాన్ని అధిగమించేందుకు రక్షణ శాఖ ముందడుగేసింది. విదేశాల నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను తీసుకురావాలని నిర్ణయించింది. తొలుత జర్మనీ నుంచి 23 సంచార ప్రాణవాయువు ఉత్పత్తి కేంద్రాలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఒక్కో సంచార ఆక్సిజన్​ కేంద్రం నిమిషానికి 40 లీటర్ల ప్రాణవాయవును ఉత్పత్తి చేయగలదు. ఈ కేంద్రాల తరలింపునకు సంబంధించి అధికారిక ప్రక్రియ పూర్తవగానే వాటిని తీసుకొచ్చేందుకు వీలుగా రవాణా విమానాలను సిద్ధం చేసి ఉంచాలని వైమానిక దళానికి రక్షణ శాఖ సూచించింది.

అయితే దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడం వల్లే ఆక్సిజన్‌ కొరత సమస్యగా కనపిస్తోందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్ధితి. ఎందుకంటే గతేడాది కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే దేశంలో ఆక్సిజన్ కొరతపై అధికారులు, పార్లమెంటరీ స్ధాయీ సంఘం కూడా కేంద్రానికి పలు హెచ్చరికలు చేశాయి. అయినా కేంద్రం పట్టించుకోలేదని తాజా పరిస్దితి చూస్తుంటే తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ నిల్వలను అందుబాటులో ఉంచాల్సిన కేంద్రం చోద్యం చూసింది. పరిస్ధితి విషమించాక ఆక్సిజన్ సరఫరా దారులతో ప్రధాని మోడీ వర్చువల్ మీట్‌ నిర్వహిస్తున్నారు. పక్క దేశాలపై ఆధారపడాల్సి పరిస్థితి నెలకొంది. దీంతో ఆక్సిజన్ కొరత విషయంలో కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.

ఆక్సిజన్‌ కోసం ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ఉక్కు కర్మాగారాలపై ఆధారపడుతున్నాయి. అనేక కొవిడ్‌ ఆస్పత్రులకు అవసరమైన ప్రాణ వాయువులో సుమారు మూడో వంతు విశాఖ ఉక్కు కర్మాగారమే సరఫరా చేస్తోంది. ప్రాణవాయువు కొరతతో సతమతమవుతున్న మహారాష్ట్రకు విశాఖ స్టీల్ ప్లాంటు ఊపిరందిస్తోంది. ఆక్సిజన్ ఎక్స్​ప్రెస్ రైలు ద్వారా 105 టన్నుల మెడికల్ ఆక్సిజన్​ను ఉక్కు పరిశ్రమ అధికారులు పంపించారు.

నిన్న మొన్నటి వరకూ స్టీల్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసే ఉక్కుకే దిక్కులేదు. అలాంటిది ఇక్కడ తయారయ్యే ఆక్సిజన్‌ను ఎవరు కొంటారని అంతా ప్రశ్నించారు. కేంద్రం మాట కూడా ఇదే. మంచి టైమ్‌ చూసి స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు శక్తులకు కట్టబెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. కానీ నెల రోజుల్లోనే పరిస్ధితి పూర్తిగా మారిపోయింది. కరోనా ఒక్కసారిగా విజృంభించడంతో స్టీల్ ప్లాంట్ అందరికీ పెద్ద దిక్కుగా మారిపోయింది. మిగతా రాష్టాలు సైతం ఇక్కడి నుంచి ఆక్సిజన్ కోసం క్యూ కట్టారు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ పేరుతో ప్రత్యేక రైళ్లు నడిపి మరీ కేంద్రం ఇక్కడి ఆక్సిజన్‌ను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది. ఖాళీ ట్యాంకర్లను విశాఖకు పంపి మరీ ఆక్సిజన్‌ను సేకరిస్తోంది. దీంతో విశాఖకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ల తాకిడి పెరిగింది. నిత్యం పదుల సంఖ్యలో ఖాళీ ట్యాంకర్లను తీసుకొచ్చి ఇక్కడి ఆక్సిజన్‌ను ఇవి నింపుకెళ్తున్నాయి. మొత్తంగా గతేడాది హెచ్చరికలను కేంద్రం పెడచెవిన పెట్టింది. ఆక్సిజన్ కొరతపై ఏడాది క్రితమే హెచ్చరించినా కేంద్రం నిర్లక్ష్యం వహించడం ప్రస్తుతం పరిస్ధితికి దారి తీస్తోంది.

Tags:    

Similar News