దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న రాకాసి ఆలయాలను సైతం వదలడంలేదు. సుప్రసిద్ధ పూరీ జగన్నాథ ఆలయంలో పనిచేస్తున్న 400 మందికి పైగా సిబ్బందికి కరోనా పాజిటివ్ సోకినట్లు ఒడిశా ప్రభుత్వ అధికారులు తెలిపారు. పూరీ శిరిమందిరాన్ని తిరిగి భక్తుల సందర్శన కోసం తెరవాలని డిమాండ్లు వినిపిస్తున్న సమయంలో అధికారులు ఈ విషయం బయటపెట్టారు. 400 మందిలో 9 మంది కరోనా వైరస్ వల్ల చనిపోయారు. వీరిలో 351మంది సేవకులు ఉండగా, మరో 53మంది సిబ్బంది ఉన్నారు. 16 మందికి భువనేశ్వర్‌లోని కోవిడ్ 19 ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ జరుగుతోంది అని శ్రీ జగన్నాథ ఆలయ పర్యవేక్షణ, పాలన అధికారి అజయ్ కుమార్ జెనా తెలిపారు.
కరోనా సోకిన చాలా మంది ఆలయ సిబ్బంది ఇళ్ల దగ్గరే ఉంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని ఆయన వివరించారు. అందువల్ల ఆలయాన్ని తెరిచేందుకు, భక్తులను అనుమతించేందుకు సిబ్బంది కొరత ఉందన్నారు. అయితే, నిత్యం జరిగే పూజలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని ఆలయ పర్యవేక్షణాధికారి స్పష్టంచేశారు. ఇదే విషయాన్ని నివేదిక రూపంలో ఒడిశా హైకోర్టుకు సమర్పించింది రాష్ట్ర సర్కార్. మొత్తం 822 మంది ఆలయ సిబ్బందికి కరోనా టెస్టులు జరిపినట్లు తెలిపింది. ఆలయాన్ని భక్తుల కోసం తెరిస్తే పూజారులు, సిబ్బంది, వారి కుటుంబాలు సహా మొత్తం 2,200 మందిపై కరోనా ప్రభావం పడుతుందని అజయ్ కుమార్ వివరించారు.