బిల్లులను వెనక్కి తీసుకునేవరకు సెషన్ బహిష్కరిస్తాం : గులాం నబీ ఆజాద్
ఎంపీల సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. లేదంటే సమావేశాలను బహిష్కరిస్తామని కాంగ్రెస్ హెచ్చరించింది. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రాజ్యసభలో ఆందోళన కొనసాగుతూనే ఉన్నది. ఆదివారం రోజున బిల్లులను అడ్డుకున్న 8 మంది విపక్ష ఎంపీలపై నిన్న వేటు వేశారు. వారంతా పార్లమెంట్‌లో ధర్నా చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా సభలో రభస కొనసాగింది. సస్పెన్షన్ పై పునారాలోచించాలని ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ చైర్మన్ వెంకయ్యనాయుడిని కోరారు.
సరిహద్దుల్లో పోరాటం తరహాలో సభలో ప్రతి నిమిషం ప్రజల కోసం పోరాడుతామన్నారు. తమ నేతల అభిప్రాయాల వినాలని ప్రజలు భావిస్తారని, కేవలం 2 లేదా 3 నిమిషాల్లో ఎవరూ పూర్తి అభిప్రాయాలను వెల్లడించలేరన్నారు. ఎంపీలపై విధించిన వేటును ఎత్తివేయాలని, ప్రైవేటు వ్యక్తులు కనీస మద్దతు ధర కన్నా తక్కువ ధరకే పంట కొనాలన్న బిల్లును తీసుకువచ్చేంత వరకు విపక్షాలు సభను బహిష్కరిస్తాయని ఆజాద్ తెలిపారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్న ఎంపీలకు రాజ్యసభ వైస్ చైర్మన్ హరివంశ్ స్వయంగా టీ అందించారు. ఆ ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఒకరోజు ఉపవాసదీక్ష చేస్తానని వైస్ చైర్మన్ ప్రకటించారు. హరివంశ్ ను పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రధాని మోడీ ట్వీట్ చేయటంతో ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.