Suez canal: ఆపరేషన్‌ సూయిజ్‌ సక్సెస్‌

Suez canal: తిరిగి ట్రాక్‌లోకి 'ఎవర్‌ గివెన్‌' నౌక * వారం తర్వాత ప్రారంభమైన నౌక ప్రయాణం

Update: 2021-03-30 01:43 GMT

సుయెజ్ షిప్ (ఫైల్ ఇమేజ్)

Suez canal: ఆపరేషన్‌ సక్సెస్‌ అయ్యింది. ఎట్టకేలకు ఎవర్‌ గివెన్‌ నౌక తిరిగి ట్రాక్‌లోకి వచ్చింది. మొత్తానికి ఇసుక తిన్నెల నుంచి నౌకను బయటకు లాగారు సహాయక సిబ్బంది. ప్రస్తుతం నౌక నీటిలో సజావుగా ముందుకు సాగుతోంది.

ఈజిప్టులోని సూయిజ్‌ కాలువలో చిక్కుకుపోయిన భారీ కంటైనర్‌ నౌక 'ఎవర్‌ గివెన్‌' ఎట్టకేలకు కదిలింది. నౌక ప్రయాణంలో ఏర్పడ్డ అవాంతరాలను అధికారులు పరిష్కరించడంతో ఈ రాకాసి ఓడ ప్రయాణం మొదలైంది. దీంతో ఇప్పటికే భారీగా జామ్‌ అయిన ఇతర నౌకలకు మార్గం సుగమమైనట్లు సూయిజ్‌ కాలువ నిర్వహణ సంస్థ వెల్లడించింది. చెప్పాలంటే నౌకలో ఒక భాగం భూమిలో కూరుకుపోవడంతో దీన్ని తిరిగి కాలవలోకి తీసుకొచ్చేందుకు వారం రోజులుగా అంతర్జాతీయ నిపుణుల బృందం తీవ్రంగా కృషి చేసింది.

ఇంతకాలం ఓడ కూరుకుపోయిన ప్రాంతంలో ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్లతో తవ్వుతూ మరోవైపు టగ్‌బోట్ల సహాయంతో నౌకను కదిలించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగించారు. అలా ఓడ కింద ఇసుకను తవ్వి నీటిని పంప్‌ చేశారు. వీటికి తోడు ఎత్తైన అలలు సహాయం చేయగా ఎవర్‌ గివెన్‌ ప్రయాణానికి మార్గం సుగమమైంది. ప్రస్తుతం నౌకను గ్రేట్‌ బిట్టర్‌ లేక్‌ వైపు తీసుకెళ్తున్న అధికారులు అక్కడ, ఎవర్‌గివన్‌ నౌకలో ఏవైనా టెక్నికల్‌ సమస్యలు ఉన్నాయా అనే అంశాలను పరిశీలించనున్నారు.

మార్చి 23న నౌక చిక్కుకుపోవడంతో సూయిజ్‌ కాలువ మీదుగా వెళ్తున్న దాదాపు 369 నౌకలు మార్గమధ్యంలోనే నిలిచిపోయాయి. వీటిలో గొర్రెలు, ఆయిల్‌ ట్యాంకర్లు, ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ ట్యాంకులూ ఉన్నాయి. దీంతో చమురు ధరలపై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ఇక వారం రోజులు నౌక నిలిచిపోవడంతో రోజుకు 65వేల 205కోట్ల వ్యాపారం స్తంభించింది. మొత్తానికి ఆసియా, యూరప్‌ల మధ్య సరుకులు రవాణా చేసే ఈ భారీ నౌక చిక్కుకుపోవడంతో అంతర్జాతీయ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడింది.

Tags:    

Similar News