యూపీలో కొనసాగుతున్న తొలి దశ అసెంబ్లీ పోలింగ్
UP: 11 జిల్లాల్లోని 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు, కోవిడ్ నిబంధనలతో ఎన్నికల నిర్వహణ.
UP: యూపీ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తొలిదశ పోలింగ్‌లో 58 స్థానాలకు 623 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలిదశలో మొత్తం 11 జిల్లాల్లో 58 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్ర 6 గంటల వరకు కొనసాగుతుంది. ఎన్నికల అధికారులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
తొలిదశ పోలింగ్‌లో ఓటు వేయడానికి పెద్ద సంఖ్యలో ఓటర్లు తరలివస్తున్నారు. 2.27 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఆర్ఎల్డీ-ఎస్పీ దోస్తీతో ఈ దఫా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారింది.అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ బరిలో.. బీజేపీ, కాంగ్రెస్, ఎస్పీ- ఆర్‌ఎల్డీ, ఆప్, ఎంఐఎం పార్టీలు పోటీలో ఉన్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలిదశలో 58 సీట్లకు పోలింగ్ జరగ్గా బీజేపీ 53 చోట్ల గెలుపొందింది.. చెరో 2 స్థానాల్లో ఎస్పీ, బీఎస్పీ, ఒక స్థానంలో ఆర్‌ఎల్డీ గెలుపొందాయి.
తొలిదశ బరిలో సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్‌లోని 9 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కేబినెట్ మంత్రులైన శ్రీకాంత్ శర్మ, సురేశ్ రాణా, సందీప్ సింగ్, కపిల్ దేవ్ అగర్వాల్, అతుల్ గర్గ్, చౌధురి లక్ష్మీ నారాయణ్‌తో పాటు మరో ముగ్గురు మంత్రులు తొలిదశ పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.