శ్రీలంకలో కొనసాగుతున్న ఆందోళనలు
Sri Lanka: ఇప్పటివరకు రాజీనామా చేయని రాజపక్సే
Sri Lanka: అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు యత్నాలుతాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింఘె నియామకం'అత్యవసర పరిస్థితి' విధిస్తున్నట్టు ప్రకటించిన రణిల్ అధ్యక్షుడి పరారీతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలుజెండాలు చేబూని ప్రధాని కార్యాలయ ముట్టడి'గో హోమ్ గొట' నినాదాలతో రాజపక్సపై నిప్పులువిక్రమ సింఘె రాజీనామా చేయాల్సిందే: విపక్షాలుగొటబాయ పరారీకి సహకరించలేదు: భారత్
రాజీనామా చేస్తానన్న శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఆ మాటే ఎత్తకుండా దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. తాత్కాలిక అధ్యక్షుడు విక్రమ సింఘె ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ పరిణామాలతో శ్రీలంక ప్రజల్లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తాయి. ఎమర్జెన్సీని సైతం లెక్కచేయకుండా వేలాదిగా ప్రధాని కార్యాలయాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు ప్రయోగం చేయాల్సి వచ్చింది.
కొలంబో, మాలె, జూలై 13: కల్లోల లంకలో బుధవారం పలు కీలక పరిణామాలు జరిగాయి. ''ఇదుగో వచ్చే బుధవారం రాజీనామా చేసేస్తా''నని నాలుగు రోజుల క్రితం ప్రకటించిన శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స బుధవారంనాడు రాజీనామా చేయకుండానే దేశం విడిచి మాల్దీవులకు పారిపోయారు. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో మాలె విమానాశ్రయానికి చేరుకున్న శ్రీలంక అధ్యక్షుడికి మాల్దీవ్స్ ప్రభుత్వ ప్రతినిధి ఒకరు స్వాగతం పలికినట్టు సమాచారం.శ్రీలంకలో ఎమర్జెన్సీ రాజపక్స వెళ్లిపోయిన విషయాన్ని ప్రధాని రణిల్ విక్రమ సింఘె కార్యాలయం ధ్రువీకరించింది. ఆయన తన భార్య, ఇద్దరు భద్రతాధికారులతో కలిసి మిలటరీ జెట్ విమానంలో రక్షణ శాఖ అనుమతితోనే దేశం వీడి వెళ్లారని శ్రీలంక వైమానిక దళం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది.
అయితే, రాజపక్స ప్రయాణించిన ఏఎన్ 32 విమానంలో ఆయనతోపాటు 13 మంది ఉన్న ట్టు సమాచారం. రాజపక్స మాల్దీవుల నుంచి సింగపూర్‌కు వెళ్లే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ శ్రీలంక వార్తాసంస్థ డైలీ మిర్రర్ ఒక కథనంలో పేర్కొనడం గమనార్హం. తుది గమ్యానికి(సింగపూర్) చేరుకున్నాకే ఆయన రాజీనామా చేస్తారని ప్రభుత్వంలోని అత్యున్నతస్థాయి వర్గాలను ఉటంకిస్తూ మరో వార్తాసంస్థ 'ద మార్నింగ్ న్యూస్' ఒక కథనంలో పేర్కొంది. రాజపక్సతోపాటు ఆయన తమ్ముడు, మాజీ ఆర్థిక మంత్రి బసిల్ రాజపక్స కూడా దేశం విడిచి వెళ్లిపోయినట్లు బీబీసీ ఒక కథనంలో పేర్కొంది. ఆయన సింగపూర్ లేదా దుబాయ్‌కి వెళ్లే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం రాత్రి సమయానికి రాజపక్స రాకకు సింగపూర్ ప్రభుత్వం అనుమతించినట్లుగా వార్తలు వచ్చాయి.
కాగా మాల్దీవులకు పారిపోయిన రాజపక్స ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమ సింఘెను యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా నియమిస్తున్నట్టు అక్కడి నుంచే ప్రకటించారు. శ్రీలంక రాజ్యాంగంలోని 37(1) అధికరణ ప్రకారం అధ్యక్షుడు దేశంలో లేనప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు ఆయన విధులు, బాధ్యతలను ప్రధాని చేపట్టవచ్చు. దీని ప్రకారమే రాజపక్స విక్రమసింఘెను తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. ఈ విషయాన్ని పార్లమెంటు స్పీకర్ మహింద యప అబేవర్దన వెల్లడించారు. రాజపక్స తనతో ఫోన్‌లో మాట్లాడారని తాను ప్రకటించిన ప్రకారమే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారని అబేవర్దన తెలిపారు.
కొత్త అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించి ఓటింగ్ జూలై 20న జరుగుతుందని చెప్పారు. కాగా తాత్కాలిక అధ్యక్షుడు విక్రమ సింఘె దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. కొలంబోలోని తన కార్యాలయం వద్ద నిరసనకారులు ఆందోళనకు దిగడంతో ఆ ప్రాంతంలో కర్ఫ్యూ విధించారు. ఎమర్జెన్సీ, కర్ఫ్యూ విధించడం ద్వారా సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసేందుకే సాయుధ దళాలకు ఆదేశాలు జారీ చేశానని వెల్లడించారు. అన్ని పక్షాలతో కూడిన ప్రభుత్వం ఏర్పడగానే తాను పదవి నుంచి వైదొలగుతానని చెప్పారు. అలాగే అధికార, ప్రతిపక్షాలకు ఆమోదయోగ్యమైన వ్యక్తిని ప్రధానిగా నియమించాలని స్పీకర్‌ను విక్రమసింఘె కోరారు.శ్రీలంకలో ఎమర్జెన్సీ వెల్లువెత్తిన ప్రజాగ్రహం తాజా పరిణామాల నేపథ్యంలో లంక ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు.
ఆర్థిక వ్యవస్థను దుర్వినియోగం చేసిన అధ్యక్షుడు రాజపక్స, ప్రధాని విక్రమ సింఘె తక్షణం పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. ఎమర్జెన్సీని లెక్క చేయకుండా వేలాది మంది నిరసనకారులు శ్రీలంక జెండాలను చేబూని ప్రధాని కార్యాలయ భవనాన్ని చుట్టుముట్టారు. పోలీసులు వారిని నిలువరించేందుకు బాష్పవాయు ప్రయోగం చేశారు. ఈ నిరసనలపై విక్రమసింఘె స్పందించారు. ''అధ్యక్షుడు దేశాన్ని వీడి వెళ్లినా కొత్త అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన చర్యలు చేపట్టినా కొంతమంది ప్రధాని కార్యాలయాన్ని చుట్టుముట్టి స్వాధీనం చేసుకోగలిగారు. రాజపక్స దేశం విడిచి మాల్దీవులకు వెళ్లడానికి వైమానిక దళానికి చెందిన విమానాన్ని ఏర్పాటు చేసినందుకు ఎయిర్‌ఫోర్స్ కమాండర్‌నివాసాన్ని చుట్టుముట్టారు.
దేశంపై నియంత్రణ సాధించడానికి ఆ గ్రూపులు ప్రయత్నిస్తున్నాయి'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ''ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు వచ్చిన పార్టీ(యునైటెడ్ నేషనల్ పార్టీ)కి చెందిన ఎంపీ (రణిల్ విక్రమసింఘె)ని గతంలో ప్రధానిని చేశారు. ఇప్పుడాయన్నే యాక్టింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారు. ఇది రాజపక్స తరహా ప్రజాస్వామ్యం. ఎంత విషాదమిది..?'' అని లంక పార్లమెంటులో విపక్ష నేత సాజిత్ ప్రేమదాస ట్వీట్ చేశారు. రాజపక్స మాల్దీవులకు పారిపోవడానికి అక్కడి పార్లమెంటు స్పీకర్, మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ సహకరించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, రాజపక్స తన పదవికి రాజీనామా చేయనందున ఇంకా ఆయన లంక అధ్యక్షుడేనని, కాబట్టి ఆయన మాల్దీవులకు రావాలనుకుంటే తాము తిరస్కరించలేమని మాల్దీవుల ప్రభుత్వం వాదిస్తున్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. మాల్దీవుల సర్కారు మాత్రం అధికారికంగా స్పందించలేదు.