Bharatbandh: దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న భారత్‌బంద్
Bharatbandh: సాగు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది.
Bharatbandh: దేశవ్యాప్తంగా సాగు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ బంద్ కొనసాగుతోంది. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం నాలుగు నెలలకు చేరడంతో.. ఇవాళ భారత్ బంద్‌కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. సాయంత్రం ఆరు గంటల వరకు సాగనున్న ఈ బంద్‌లో రైలు, రోడ్డు రవాణా సర్వీసులను బ్లాక్ చేయాలని రైతు నేతలు నిర్ణయించారు. అంబులెన్స్, అత్యవసర సేవలు మినహా అన్నింటినీ అడ్డుకుంటామని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. దీంతో దేశంలోని పలుచోట్ల రవాణా నిలిచిపోయింది.
సరిహద్దుల్లో కొనసాగుతున్న నిరసన...
ఉత్తరప్రదేశ్‌ను కలిపే ఘాజిపూర్ సరిహద్దు వద్ద సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ఆందోళన చేపట్టారు. రోడ్లపై నృత్యాలు చేస్తూ నిరసన తెలియజేశారు. దీంతో 24వ నంబరు జాతీయరహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బంద్ దృష్ట్యా ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు నిలిపివేసినట్లు దిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అటు పంజాబ్, హరియాణాల్లోనూ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. అమృత్‌సర్‌లో రైతు మద్దతుదారులు రైల్వే ట్రాక్‌పై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బంద్ నేపథ్యంలో నాలుగు శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. పంజాబ్, హరియాణాలోని 32 ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది
స్టీల్ ప్లాంట్ ఉద్యమం...
ఇక ఏపీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. అధికార పార్టీతో పాటు విపక్షాలు భారత్ బంద్‌కు మద్దతిచ్చాయి. బంద్‌లో పాల్గొనేందుకు వామపక్షాల నేతలు, కార్మికులు భారీగా తరలివచ్చారు. రోడ్లపై బైఠాయించి రాస్తారోకోలు చేస్తున్నారు. అటు ఆర్టీసీ బస్సులు కూడా డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో రాష్ట్రంలో రవాణా స్తంభించింది. మరోవైపు తెలంగాణలో బంద్ ప్రభావం కనిపించడం లేదు. ఏపీఎస్ ఆర్టీసీ బస్సులతో పాటు ఏపీకి వెళ్లే బస్సులు మాత్రం ఎంజీబీఎస్‌కు పరిమితమయ్యాయి. ఇక నాలుగు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనలు చేస్తోన్న రైతు సంఘాలు ఘాజీపూర్, టిక్రి, సింఘు బార్డర్‌లలో బైఠాయించారు. ఇక భువనేశ్వర్‌లో రైల్ రోకో నిర్వహించాయి వ్యాపార సంఘాలు. ట్రాక్‌లపై పెద్ద ఎత్తున జెండాలతో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. దీంతో ఆ ప్రాంతాల్లో భారీఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి.