Narendra Modi-Amit Shah: ప్రచారంతో దుమ్ములేపిన మోడీ, అమిత్ షా
Narendra Modi-Amit Shah: బీజేపీకి ఫలించిన డబుల్ ఇంజిన్ మంత్రం
Narendra Modi-Amit Shah: వాళ్ల స్కెచ్‌కు తిరుగుండదు. వాళ్లిద్దరు బరిలో దిగితే ఎదురుండదు.. రాష్ట్రం ఏదైనా, ఎన్నిక ఎలాంటిదైనా ఇజ్జత్ కా సవాల్ అంటూ.. జనంలో సెంటిమెంట్‌ను రగుల్చుతూ.. విపక్షాల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ దూసుకుపోతారు. విజయం సాధించే వరకు నిద్దురపోరు. తాజాగా ఐదు రాష్ట్రాల ఫలితాలను సింగిల్ ఎజెండాతో వార్ వన్‌సైడ్ అనిపించారు. ఆ ఇద్దరిలో ఒకరు ప్రధాని మోడీ అయితే, మరొకరు హోంమంత్రి షా. ఇంతకూ బీజేపీ టాప్ లీడర్స్ ఆ ఐదు రాష్ట్రాల్లో అమలు చేసిన వ్యూహాలేంటి..?
యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్. రాష్ట్రం ఏదైనా, ఎన్నిక ఎలాంటిదైనా టార్గెట్ విజయం ఒక్కటే. నరేంద్ర మోడీ, అమిత్ షా రంగంలోకి దిగితే విజయం ఆటోమెటిక్‌గా సాగిలపడిపోవాల్సిందే. సరిగ్గా ఐదు రాష్ట్రాల ఫలితాల్లో అడుగడుగునా ఈ ఇద్దరి నేతల పనితీరు స్పష్టమైంది. పంజాబ్ మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో కాషాయ జెండలు రెపరెపలాడాయి. కౌంటింగ్ మొదలైన దగ్గర నుంచీ వన్‌సైడెడ్ రిజల్ట్‌తో విపక్షాల అడ్రస్ గల్లంతని తేలిపోయింది.
ప్రధానంగా ఉత్తర ప్రదేశ్‌ను ఇజ్జత్ కా సవాల్‌గా తీసుకున్న ఈ టాప్ లీడర్స్ ప్రచారంలో దుమ్ము లేపేశారు. పదే పదే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ క్యాపెయినింగ్‌లో దూసుకెళ్లిపోయారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడమే ఆలశ్యం అభివృద్ధి పథకాలకు సంక్షేమం జోడిస్తూ రోజుకో కొత్త కార్యక్రమం చేపడుతూ నిత్యం ఓటర్లతో మమేకం అయిపోయారు. విపక్ష పార్టీల విమర్శలను తమకు అనుకూలంగా మలుచుకుంటూనే తమను తాము బాహుబలిగా ప్రొజెక్ట్ చేస్తూ ఓట్లను కొల్లగొట్టారు. యూపీలో యోగి క్లీన్ ఇమేజ్‌కు మోడీ, షా టాప్ క్యాపెయినింగ్ తోడవ్వడంతో తిరుగులేని శక్తిగా, రెండోసారి అధికారం చేపట్టింది.
ఎన్నికల కంటే ముందునుంచే మోడీ, అమిత్ షాలు యూపీపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ పార్టీ ఆయుధమైన సోషల్ ఇంజనీరింగ్‌ను సక్సెస్ ఫుల్‌గా అమలు చేశారు. బంధుప్రీతి, టిక్కెట్లు అమ్ముకోవడం వంటివి చేయకుండా ప్రజా క్షేత్రంలో కష్టపడే వారికే బీ ఫామ్ ఇవ్వడం.. అలాగే, ఇప్పుడు యోగీ గెలిస్తే భవిష్యత్తులో భారత ప్రధాని రేసులో ముందుంటారని అమిత్ షా ప్రకటించడం లాంటి వ్యూహాలు వర్క్‌ఔట్ అయ్యాయి అయితే హత్రాస్ సంఘటన, రైతు ఉద్యమ నేత రాకేష్ టికాయత్ వ్యతిరేక ప్రచారం, త్రిపుల్ తలాక్, కట్టర్ హిందుత్వ వంటి ప్రతికూల అంశాలు ఉన్నా వాటి ప్రభావాన్ని పరిమితం చేయడంలో ఈ ఇద్దరు నేతలు సూపర్ సక్సెస్ అయ్యారు.
ప్రధాని మోడీ, అమిత్ షాలు ప్రతిరోజు రెండు రాష్ట్రాలను చుట్టేస్తూ ప్రచార జోరును కొనసాగించారు. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లోనూ ప్రచారంలో దుమ్ములేపారు. అయితే పంజాబ్‌లో రైతు చట్టాల ప్రభావంతో వర్క్‌ఔట్ కాకపోయినా ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు. చిన్న రాష్ట్రాలైనా ఈ మూడింటినీ ఏమాత్రం లైట్ తీసుకోలేదు. మణిపూర్ సహా ఏ ఒక్క రాష్ట్రంలోనూ విపక్షాల ఎత్తుగడలను ఈ ఇద్దరు నేతలూ పారనీయలేదు. ప్రధాన ప్రతి పక్షం కాంగ్రెస్‌ను కుటుంబ పార్టీ గానూ లోకల్ పార్టీలను తమ పవర్ పంచ్‌లతోనూ ఏకిపారేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఈ ఐదు రాష్ట్రాల్లో ఎక్కడ పర్యటించినా ఇప్పటి వరకు తమ హయాంలో జరిగిన అభివృద్ధి జస్ట్ ట్రైలర్ మాత్రమేనని, వచ్చే 25 ఏళ్లకు ఇది పునాది మాత్రమే అంటూ ప్రచారంలో దూసుకుపోయారు.
మొత్తంగా అటు మోడీ, ఇటు అమిత్ షాల స్టార్ క్యాంపెయినింగ్ యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బీజేపీని బంబర్ మెజారిటీతో గెలిపించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తాజా విజయం బీజేపీకి బూస్ట్ ఇచ్చేదే ప్రధానంగా యూపీలో పాగా వేయడంతో వచ్చే ఎన్నికల్లో తమ పని మరింత ఈజీ అవుతుందని భావిస్తున్నారట. ఇదే ఊపులో ఇక ముందూ నేతలిద్దరూ నెక్స్ట్ ఎలక్షన్స్‌పై ఇప్పటి నుంచే దృష్టి సారించారట కూడా.