దండి ఉప్పు సత్యాగ్రహానికి 92 ఏళ్లు.. అమిత్‌షా సైకిల్ యాత్ర...
Dandi Salt Satyagraha: 1930 మార్చి 12న దండి యాత్రను ప్రారంభించిన గాంధీజీ...
Dandi Salt Satyagraha: స్వాతంత్ర పోరాటంలో బ్రిటీష్ వారు విధించిన ఉప్పు పన్నును నిరసిస్తూ మహాత్మా గాంధీ చేపట్టిన దండి సత్యాగ్రహ పోరాటానికి నేటితో 92 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దండి సత్యాగ్రహ పోరాటంలో పాల్గొన్న మహాత్ముడితో పాటు సత్యాగ్రహులకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. అహ్మదాబాద్‌లో దండ్రి సైకిల్ యాత్రను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీజీతో పాటు దండి పోరాటంలో పాల్గొన్న సత్యాగ్రహులకు నివాళులర్పించారు. మహాత్ముడు చేపట్టిన దండి యాత్ర.. స్వతంత్ర పోరాటంలో కీలక ఘట్టంగా అమిత్‌షా అభివర్ణించారు.ఉప్పు ఉత్పత్తిపై బిట్రీష్ గుత్తాధిపత్యానికి వ్యతిరేకంగా అహింసా నిరసనలో భాగంగా ఉప్పు సత్యాగ్రహాన్ని గాంధీజీ ప్రారంభించారు. ఈ పాదయాత్ర 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు 384 కిలోమీటర్ల దూరం మేర వేలాది మంది సత్యాహ్రహులతో కలిసి గాంధీ పాదయాత్ర చేశారు.
గుజరాత్ తీరంలోని దండి వద్ద ఉప్పును తయారుచేసి.. ఉప్పు చట్టాన్ని ఉల్లంఘించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రిటీష్ ప్రభుత్వం 1930 మార్చి 31 నాటికి 95వేల మందిని అరెస్టు చేసింది. ఉప్పు తయారుచేసిన గాంధీజీతో సహా దండి యాత్రలో పాల్గొన్న వారిని 1930 మే 5న అరెస్టు చేసి.. ఎరవాడ జైలుకు తరలించారు. శాసనోల్లంఘన కోసం చేపట్టిన దండ్రి పోరాటం.. భారత స్వతంత్ర పోరాటంలో ప్రధాన ఘట్టంగా నిలిచింది.