Omicron Variant: జనాలను భయపెడుతున్న ఒమిక్రాన్

Omicron Variant: డెల్టా రకం కంటే ప్రమాదకరం

Update: 2021-11-27 02:27 GMT
Representational Image

Omicron Variant: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది. కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న వేళలో మరో ఉద్ధృతికి దారితీయవచ్చన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన బి.1.1.529 వేరియంట్‌ పక్కదేశం బోట్స్‌వానాతో పాటు హాంకాంగ్‌కూ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్‌, బెల్జియంలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్‌ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దక్షిణాఫ్రికాలో సగటున రోజూ 200 మంది కరోనా బారిన పడుతుండగా నాలుగైదు రోజుల నుంచి కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంటే ఇందుకు కారణమా? అన్నది మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. తాజాగా మలావి నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చిన ఓ వ్యక్తికి బి.1.1.529' సోకింది. మరో ఇద్దరు కూడా దీనిబారిన పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురూ పూర్తిస్థాయి వ్యాక్సిన్‌ తీసుకున్నవారే కావడంతో ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు విస్తుపోతున్నారు. తాజా పరిణామాల క్రమంలో- ఇజ్రాయెల్‌ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్‌ అత్యవసరంగా కేబినెట్‌ సమావేశం ఏర్పాటుచేసి, కొత్త వేరియంట్‌పై సమీక్షించారు. తమ దేశం అత్యయిక పరిస్థితి ఆరంభంలో ఉన్నట్టు వ్యాఖ్యానించారు.

దక్షిణాఫ్రికా సహా మొత్తం ఆరు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్‌ ఆంక్షలు విధించింది. బ్రిటన్‌లో ఇప్పటివరకూ బి.1.1.529 వేరియంట్‌ నమోదు కాకపోయినా దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, లెసాతో, ఎస్వాతిన్‌, జింబాబ్వే, నమీబియాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్‌, జపాన్‌లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చేవారిపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి.

కొత్త వేరియంట్‌కు సంబంధించి భారత్‌లో ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని ఇండియన్‌ సార్స్‌-కొవ్‌-2 జీనోమిక్స్‌ కన్సార్షియం వెల్లడించింది. ప్రజలంతా కొవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించింది. కొత్త వేరియంట్‌ను పర్యవేక్షిస్తున్నామని, ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News