ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు.. పండుగ వేళ, రాత్రిపూట కర్ఫ్యూ...

Omicron Guidelines in India: ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని సూచన...

Update: 2021-12-24 04:00 GMT

ఒమిక్రాన్ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు.. పండుగ వేళ, రాత్రిపూట కర్ఫ్యూ...

Omicron Guidelines in India: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి రాష్ట్రాలకు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు గైడ్‌లైన్స్ జారీ చేసింది. రాష్ట్రాలు మరింత అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని తెలిపింది. ఒమిక్రాన్ ముప్పు రాకముందే ఆంక్షల్ని అమలులోకి తీసుకురావాలని, కనీసం 14 రోజులు ఆంక్షలు అమలులో ఉండేలా చూడాలని వివరించింది.

కరోనా పరీక్షల పాజిటివిటీ రేటు 10శాతం మించినా, స్థానిక ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ పడకల భర్తీ 40శాతానికి సమీపించినా ప్రాంతాల వారీగా కట్టడి చర్యలకు వెంటనే తీసుకోవాలని తెలిపింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై దృష్టిసారించాలని సూచించింది. ఒమిక్రాన్‌ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నందున ముప్పు రాకముందే ఆంక్షలు అమలు చేయాలని.. కంటైన్‌మెంట్‌ జోన్లలో ఈ ఆంక్షలు కనీసం 14 రోజులు అమల్లో ఉండేలా చూడాలని స్పష్టం చేసింది.

ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని.. స్థానిక ప్రత్యేక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ అవసరమైతే క్రిస్మన్‌, నూతన సంవత్సర వేడుకలపైనా ఆంక్షలు విధించాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. భారీ సభలు, సమూహాలను నియంత్రించాలి. బాధితుల నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ కోసం ఇన్సాకాగ్‌ ల్యాబ్‌లకు పంపించాలి. జిల్లాల్లో డెల్టా, ఒమిక్రాన్‌ కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలించాలి.

పాజిటివిటీ రేటు, డబ్లింగ్‌ రేటు ఎక్కువ ఉన్న ప్రాంతాలపై దృష్టిపెట్టాలని కేంద్రం గైడ్‌లైన్స్‌లో పేర్కొంది. అలాగే ఆసుపత్రుల్లో పడకల సామర్థ్యం, అంబులెన్స్‌, ఇతర సదుపాయాలను అందుబాటులో ఉంచాలని తెలిపింది. రాష్ట్రంలో వైరస్‌ పరిస్థితిని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని, మాస్క్‌లు, భౌతికదూరం వంటి నిబంధనలు పాటించేలా ప్రోత్సహించాలని పేర్కొంది.

వ్యాక్సినేషన్‌ను మరింత వేగవంతం చేయాలని ఆదేశించింది కేంద్రం. జాతీయ సగటు కంటే తక్కువ వ్యాక్సినేషన్‌ రేటు ఉన్న జిల్లాల్లో ఇంటింటి టీకా పంపిణీ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని సూచించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో 100 శాతం టీకా పంపిణీ పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని తెలిపింది. కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కరోనా బాధితులు ఉన్నారేమో పరిశీలించి అనుమానితులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించాలని పేర్కొంది.

Tags:    

Similar News