9 సెకన్లలో 40 అంతస్తులు నేలమట్టం.. కాసేపట్లో నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత..
Noida Twin Towers: నోయిడాలోని ట్విన్ టవర్స్ కాసేపట్లో కూల్చివేయనున్నారు.
Noida Twin Towers: నోయిడాలోని ట్విన్ టవర్స్ కాసేపట్లో కూల్చివేయనున్నారు. మరికొద్ది నిమిషాల్లో ఒక్క బటన్ నొక్కడంతో 100 మీటర్లకు పైగా పొడవైన ఈ జంట భవనాలు కేవలం 9 సెకన్లలోనే పేకమేడల్లా నేలమట్టం కానున్నాయి. సూపర్‌టెక్ సంస్థ నోయిడాలో నిర్మించిన ట్విన్ టవర్స్ కూల్చివేతకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. సరిగ్గా రెండు గంటల 30 నిమిషాలకు ఈ ట్విన్ టవర్స్ కుప్పకూలనున్నాయి.
ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు 3వేల 700 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించనున్నారు. వీటికి రెండు వేల వరకు కనెక్షన్లు ఇచ్చారు. ఇందుకోసం భవనాల పిల్లర్లలో 7వేల రంధ్రాలు చేశారు. 20వేల సర్క్యూట్లు ఏర్పాటు చేశారు. 100 మీటర్ల నుంచి మీట నొక్కగానే భవనాలు నిలువుగా కుప్పకూలి, పిల్లర్లు పేలిపోతాయి. దీన్ని వాటర్‌ఫాల్ టెక్నిక్‌గా పిలుస్తారు.
కూల్చివేత వల్ల సమీపంలోని భవనాలకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ భవనాల్లో ఉంటున్న వాళ్లను తాత్కాలికంగా ఖాళీ చేయించారు. చుట్టుపక్కల బిల్డింగ్స్‌ను ప్లాస్టిక్ షీట్లతో కప్పేశారు. ఈ జంట భవనాల చుట్టూ 500 మీటర్ల మేర జనసంచారం లేకుండా అధికారుల చర్యలు చేపడుతున్నారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఫైర్ సిబ్బందితో పాటు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. సమీపంలోని హైవేపై వాహనాల రాకపోకల్ని నిలిపివేశారు.
ముంబయికి చెందిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ, దక్షిణాఫ్రికాకు చెందిన జెట్ డిమాలిషన్స్ కలిసి ఈ పని చేపడుతున్నాయి. పేలుడుకు సుమారు 10 సెకన్లు పడుతుందని, తర్వాత నాలుగైదు సెకన్లలో పూర్తిగా కిందకు పడిపోతాయని ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ తెలిపింది. దుమ్ము చెదరడానికి సుమారు 10 నిమిషాలు పడుతుందని చెప్పారు. గతంలో తెలంగాణ సచివాలయం, సెంట్రల్ జైలును, గుజరాత్‌లో పాత మొతెరా స్టేడియంను ఈ సంస్థే కూల్చింది.
ట్విన్ టవర్స్ కూల్చివేతతో 25 వేల క్యూబిక్ మీటర్ల శిథిలాలు మిగులుతాయని అంచనా వేస్తున్నారు. ఈ వ్యర్థాల్లో దాదాపు 4 వేల టన్నుల ఉక్కు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. వాటి తొలగింపునకు కనీసం మూడు నెలల సమయం పట్టనుందని తెలుస్తోంది. మన దేశంలో ఇప్పటి వరకూ జరిగిన కూల్చివేతల్లో ఇదే అతిపెద్ద కూల్చివేత కానుంది.
ఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక కుతుబ్‌మినార్ కన్నా ఈ ట్విన్ టవర్స్ ఎత్తైనవి. ఈ జంట భవనాల కూల్చివేత వల్ల 30 మీటర్ల పరిధిలో కొన్ని సెకన్ల పాటు కంపనాలు సంభవిస్తాయి. సెకనుకు 30 ఎం.ఎం మాగ్నిట్యూడ్‌తో ఈ కంపనాలు వెలువడతాయని తెలుస్తోంది. ఇది రిక్టర్ స్కేల్‌పై 0.4 భూకంపంతో సమానమని అధికారులు చెబుతున్నారు.