పార్లమెంటు శీతాకాల సమావేశాలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది శీతాకాల సమావేశాలను నిర్వహించడం లేదని స్పష్టం చేైసింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. సమావేశాల నిర్వహణకు సంబంధించి అన్ని పార్టీల నేతలతో కేంద్రం చర్చలు జరపగా.., ఈ సమావేశంలో సభ్యులందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో సమావేశాలను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఒకేసారి జనవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నామన్నారు మంత్రి ప్రహ్లాద్ జోషి. కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలపై పార్లమెంట్‌లో చర్చించాలని కాంగ్రెస్ లోక్‌సభ నేత అధిర్ రంజన్ చౌధరీ డిమాండ్ చేసిన నేపథ్యంలో జోషి లేఖ ద్వారా నిర్ణయాన్ని తెలియజేశారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడతారని చెప్పారు. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఇప్పటికే కసరత్తును ప్రారంభించిందని అన్నారు.
మరోవైపు పార్లమెంటు సమావేశాలు జరగాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి పట్టుబడుతున్నారు. రైతులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో, రైతు సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. రైతుల ఉద్యమాలకు భయపడే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలను నిర్వహించడం లేదని ఎద్దేవా చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని అన్నారు.