జనవరి 7 తర్వాత శుభకార్యాలకు ఫుల్ స్టాప్
* 115 రోజులపాటు కానరాని శుభముహుర్తాలు * జనవరి 8 తర్వాత సంక్రాంతి పీడ దినాలు * జనవరి 14 నుంచి ఫిబ్రవరి 12 వరకు శూన్యమాసం
జనవరి 7 తరువాత మూడున్నర నెలల పాటు పెళ్లి బాజాలకు విరామమే. ఒకదాని వెంట ఒకటిగా గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమిలు కలిసి రావటంతో కొత్త సంవత్సరం తొలి వారం నుంచి ఏకంగా 115 రోజులపాటు శుభ ముహూర్తాలు లేకుండా పోయాయి. మళ్లీ మే 14 నుంచి బలమైన ముహూర్తాలు మొదలు కానున్నాయి.
జనవరి 8న దశమి ముగుస్తుంది. ఆ తర్వాత సంక్రాంతి పీడ దినాలుగా భావిస్తూ శుభకార్యాలు నిర్వహించరు. జనవరి 14 పుష్య శుద్ధ పాఢ్యమి నుంచి ఫిబ్రవరి 12 వరకు శూన్యమాసం కొనసాగనుంది. ఈ సమయంలో శుభ దినాలు ఉండవు. అదే సమయంలో జనవరి 15 పుష్య శుద్ధ విదియ నుంచి ఫిబ్రవరి 12 మాగ శుద్ధ పాఢ్యమి వరకు 29 రోజులపాటు గురు మౌఢ్యమి కొనసాగనుంది. మళ్లీ ఫిబ్రవరి 14 మాగ శుద్ధ తదియ నుంచి మే 4 చైత్య బహుళ అష్టమి వరకు ఏకంగా 80 రోజుల పాటు శుక్ర మౌఢ్యమి ఏర్పడనుంది. ఆ తర్వాత మరో పది రోజులపాటు శుభ దినాలున్నా బలమైన ముహూర్తాలు లేవు.
తిరిగి మే 14 నుంచి బలమైన ముహూర్తాలు మొదలవుతున్నాయని పండితులు పేర్కొంటున్నారు. ఈ రెండు మూఢాల మధ్య రెండు రోజుల విరామం ఉన్నా, అవి బలమైన ముహూర్తాలకు అవకాశం లేనివేనని అంటున్నారు. ఆ తర్వాత బలమైన ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. మళ్లీ జూలై 4 నుంచి మొదలయ్యే అషాఢమాసం ఆగస్టు 11 వరకు కొనసాగనుంది. ఇది కూడా శుభముహూర్తాలు లేని సమయమే. ఇలా 2021లో ముహూర్తాలకు కొరతే ఏర్పడనుంది.
బంధువులను పిలుచుకోవడం సాధ్యం కాకపోవడంతో కరోనా సమయంలో చాలా మంది శుభకార్యాలు నిర్వహించుకోలేదు. ఇప్పుడు కాస్త కోవిడ్ ప్రభావం తగ్గినా జనవరి 7 తర్వాత మంచి ముహూర్తాలు లేక నిరాశకు గురవుతున్నారు.