బిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
Nitish Kumar: ఎన్డీయేకు నితీశ్ రాం రాం..
Nitish Kumar: రెండంటే రెండే రోజులు బిహార్ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. గంటల వ్యవధిలోనే ఎన్డీయేకు రాం రాం చెప్పిన నితిష్ కుమార్ యూపీఏ పార్టీలతో మహా ఘట్ బంధన్ ఏర్పాటు చేశారు. తన పదవికి రాజీనామా సమర్పించారు. ఇవాళ సాయంత్రం మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. బిహార్‌లో నిన్న రోజంతా నడిచిన పొలిటికల్ హైడ్రామా క్షణం క్షణం తీవ్ర ఉత్కంఠగా సాగింది. బీజేపీతో దోస్తీకి తెగదెంపులు చేసుకున్న నితీశ్ కుమార్ ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసిన మహా ఘట్ బంధన్‌తో జట్టుకట్టారు. గవర్నర్ తో రెండుసార్లు భేటీ అయిన నితీశ్ తన రాజీనామాతో పాటు కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలంటూ కోరారు. గవర్నర్ ఆమోదంతో ఈ సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే 7 సార్లు సీఎంగా చేసిన నితీశ్ ఇవాళ ప్రమాణస్వీకారం చేస్తే 8 వ సారి సీఎంగా అయినట్లు అవుతుంది.
ఇక మహా ఘట్ బంధన్ ఏర్పాటులో కీలకంగా మారిన ఆర్జేడీ ప్రభుత్వంలో చేరబోతోంది. ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ తమకు 7 పార్టీల మద్దతుందని ప్రకటించారు. మొత్తం 164 మంది ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని వీరితో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. పార్టీ సభ్యులందరి ఏకాభిప్రాయంతోనే రాజీనామా చేసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేపీపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. కమలం పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీలు నాశనం అవుతాయని ఈ విషయం చరిత్రే చెబతుందని చెప్పుకొచ్చారు. పంజాబ్, మహారాష్ట్రలలో జరిగింది అదేనన్న ఆయన భాగస్వామ్య పార్టీలను చీల్చి పగ్గాలు చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ విషయంలో నితీష్ కుమార్ త్వరగా మేల్కొన్నారని అన్నారు.
మరోవైపు నితిష్‌పై సోషల్ మీడియాలో ట్రోల్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఎన్డీఏ నుంచి బయటకు రావడంపై ఫన్నీ మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. ఎవరితో పొత్తు పెట్టుకున్నా సీఎం మాత్రం నితీషే అని పదవి కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటారంటూ క్రియేట్ చేసిన మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.