Niti Aayog Report: సెప్టెంబరులో కరోనా థర్డ్ వేవ్ తథ్యం

* సెప్టెంబరులోనే రోజుకు 5 లక్షల కరోనా కేసులొచ్చే అవకాశం * కేంద్రాన్ని హెచ్చరించిన నీతి ఆయోగ్‌, ఎన్‌ఐడీఎం

Update: 2021-08-24 05:15 GMT

సెప్టెంబరులో కరోనా థర్డ్ వేవ్ తథ్యం (ఫైల్ ఫోటో)

Corona Third Wave: కరోనా మూడో ఉద్ధృతి సెప్టెంబరు, అక్టోబరులో దేశాన్ని చుట్టుముట్టనుందని రెండు కీలక సంస్థలు కేంద్రాన్ని హెచ్చరించాయి. మూడో వేవ్‌ తథ్యమని అవి పేర్కొన్నాయి. సెప్టెంబరులోనే దాదాపు రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దాదాపు రెండు లక్షల ఐసీయూ పడకలను సిద్ధం చేసుకోవాలని తెలిపాయి. ఈ మేరకు ఎన్‌ఐడీఎం, నీతి ఆయోగ్‌ కేంద్రాన్ని అప్రమత్తం చేశాయి.

హోంమంత్రిత్వశాఖ ఆధీనంలోని ఎన్‌ఐడీఎం కరోనా మూడో దశ ముప్పుపై తన నివేదికను ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. ఇందులో కొవిడ్‌-19 ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నీతి ఆయోగ్‌ కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ఆగస్టులోనే రోజుకు 4 నుంచి 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మూడో ఉద్ధృతిలో ఆసుపత్రుల్లో 23 శాతం మంది చేరతారని, దాదాపు రెండు లక్షల ఐసీయూ పడకలను కేంద్రం సిద్ధం చేసుకోవాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు తెలిపారు.

కొవిడ్‌-19 పోరులో భారత్‌కు సెప్టెంబరు, అక్టోబరు నెలలు కీలకం కానున్నాయని జాతీయ ప్రకృతి వైపరీత్య నిర్వహణ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది. వైరస్‌లో మార్పులు అధికమైతే సెప్టెంబరులోనే రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. పరిస్థితులను బట్టి సెప్టెంబరు నుంచి అక్టోబర్‌ చివరినాటికల్లా ఎప్పుడైనా దేశంలో మూడో ఉద్ధృతి కనిపించవచ్చని పేర్కొంది.

ఇందులో చిన్నారులపై ఎక్కువ ప్రభావం కనిపిస్తుందని చెప్పే ఆధారాలు ఎక్కడా లేవని స్పష్టంచేసింది. ఒకవేళ వస్తే మాత్రం పిల్లలకు సరిపడా వైద్యసౌకర్యాలు దరిదాపుల్లోకూడా లేవని ఆందోళన వ్యక్తంచేసింది. వ్యాక్సిన్‌ కార్యక్రమం మందకొడిగా సాగడంపై కూడా ఈ నివేదిక చర్చించింది.

ప్రస్తుతం 7.6 శాతం మంది మాత్రమే పూర్తిస్థాయిలో టీకాలు వేసుకున్నారని, ఈ సంఖ్య పెరగకపోతే రోజుకు ఆరు లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రముఖ నిపుణులందరూ దేశంలో కొవిడ్‌ మూడో వేవ్‌ తథ్యమని చెబుతున్నారు. ఇన్‌ఫెక్షన్‌ ద్వారాకానీ, వ్యాక్సినేషన్‌ ద్వారాకానీ రోగనిరోధకశక్తి పెంచుకొని సామూహిక రోగనిరోధకశక్తిని సాధిస్తేనే కరోనాకు ముగింపు సాధ్యమని అంటువ్యాధుల నిపుణులు పేర్కొంటున్నారు. ఇదివరకు 67శాతం మంది దేశ ప్రజలకు ఇలాంటి శక్తి వస్తేనే హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధ్యమవుతుందన్నారు.

Tags:    

Similar News