స్వచ్ఛంద సంస్థల ముసుగులో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రమూకలకు కొందరు సాయం చేస్తున్నారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోందిప్పుడు ! జమ్ముకశ్మీర్‌లోని పదిప్రాంతాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ ఎన్జీవో, ట్రస్ట్ సంబంధించి కేసులో ఈ చెకింగ్స్ జరిగాయ్. సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు సేకరించిన ఆ ఎన్జీవో వేర్పాటువాద కార్యకలాపాల కోసం నిధులు ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయ్. దీంతో రంగంలోకి దిగిన ఎన్ఐఏ శ్రీనగర్, బందిపురాతో పాటు బెంగళూరులోని ఓ లొకేషన్‌లో సోదాలు నిర్వహించింది.
ఈ తనిఖీల్లో భాగంగానే గ్రేటర్ కశ్మీర్ పత్రిక కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించారు. కశ్మీర్ ఉద్యమ కార్యకర్త ఖుర్హమ్ పర్వేజ్ ఇంట్లోనూ తనిఖీలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఎన్జీవో నిధుల దుర్వినియోగం కింద కొత్త కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. 2016లో పర్వేజ్‌ను అరెస్ట్ చేశారు. 76రోజుల నిర్బంధం తర్వాత సెషన్స్ కోర్ట్ ఆదేశాల ప్రకారం విడుదల అయినా ప్రజా భద్రత చట్టం ప్రకారం మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఇక ఖుర్హమ్ పర్వేజ్, గ్రేటర్ కశ్మీర్ ఆఫీసులపై జరిగిన ఎన్ఐఏ సోదాలను మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ ఖండించారు. భావ స్వేచ్ఛ, అసమ్మతిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని ఆరోపించారు. బీజేపీ పెంపుడు ఏజెన్సీగా ఎన్ఐఏ మారిందని విమర్శించారు.