Mumbai: అంబానీపై హత్యాయత్నం సచిన్ వాజే పనే
Mumbai: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనాన్ని నిలిపింది ఎవరో తేలిపోయింది.
Mumbai: భారత కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాల వాహనాన్ని నిలిపింది ఎవరో తేలిపోయింది. అసలు దొంగ పోలీసేనని తేల్చారు NIA అధికారులు. ముంబైలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరున్న సచిన్ వాజే అత్యంత వివాదాస్పదుడుగా తయారయ్యారు. ఆయనే వాహనాన్ని అంబానీ నివాసం ముందు నిలిపినట్లు సీసీ టీవీ దృశ్యాల ద్వారా నిర్థారించారు జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు. తనను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు సచిన్ వాజే చాలా జాగ్రత్తలు తీసుకున్నాడని అయితే అంతిమంగా దొరికిపోయాడని అధికారులు తెలిపారు. వాజేని అరెస్ట్ చేయడంతో వ్యవహారమంతా బయటకొస్తోంది.
ఇదిలా ఉంటే అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్థాల కారు కేసులో ఎన్‌ఐఏ తీరును మహారాష్ట్ర ప్రభుత్వం తప్పుపడుతోంది. మధ్య మధ్యలో దర్యాప్తు వివరాలను వెల్లడించకుండా విచారణ పూర్తయ్యాకే పూర్తి వివరాలు చెప్పాలని మంత్రి పాటిల్ సూచించారు. పోలీస్ అధికారి సచిన్ వాజేను ఎన్ఐఏ అరెస్టు చేసిన నేపథ్యంలో మహా కేబినెట్‌లో కీలక మంత్రుల సమావేశం జరిగింది. ఈ భేటీ అనంతరం మంత్రి పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ఎన్‌ఐఏ తీరుపై అభ్యంతరం తెలిపారు. ఎన్ఐఏ ఈ కేసును త్వరగా దర్యాప్తు చేసి ఒక పరిష్కారానికి వచ్చాక వివరాలు వెల్లడిస్తే మంచిదని మహా మంత్రి పాటిల్ సూచించారు.