Bodies Floating in Ganga River: గంగలో మృతదేహాలపై కేంద్రానికి ఎన్ హెచ్ ఆర్సీ నోటీసులు
Bodies Floating in Ganga River: గంగానదిలో మృతదేహాలు కొట్టుకు వస్తున్న ఘటనలపై ఎన్‌హెచ్ఆర్సీ తీవ్రంగా స్పందించింది
Bodies Floating in Ganga River: గంగానది లో స్నానం చేయడం వలన పాపాలన్నీ పటాపంచలవుతాయి అంటారు. గోదావరి నదిలో ఒకసారి స్నానం చేయడం వలన వంద సంధ్యా వందనాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని పెద్దలు చెప్తున్నారు. అదే గంగా నదిలో కరోనా మృతదేహాలు కొట్టు వస్తే ఏ పుణ్యం వస్తుందో తెలియడం లేదు. దేశంలో హెల్త్ ఎమర్జన్సీ విధించి కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గంగా నదిలో శవాల ప్రవాహాలు గుర్తు చేస్తున్నాయి.
గత నాలుగు రోజులుగా గంగానదిలో మృతదేహాలు కొట్టుకు వస్తున్న ఘటనలపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనలపై ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ.. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటనకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారో తమకు నాలుగు వారాల్లోపు నివేదికను అందజేయాలని ఆదేశించింది.
'ఈ విషయంలో స్థానిక అధికారులు విఫలమైనట్టు స్పష్టంగా తెలుస్తోంది. పవిత్ర గంగానదిలో మృతదేహాలను పడేయటం గంగా ప్రక్షాళన ప్రాజెక్టు నిబంధనలను ఉల్లంఘించడమే.. అవి కొవిడ్ బాధితుల మృతదేహాలుగా మాకు అందిన ఫిర్యాదుల్లో అనుమానాలు వ్యక్తం చేశారు. గంగా నదిలో కాలుష్యాన్ని కలిగించే ఏ ప్రాజెక్ట్ లేదా ప్రక్రియ లేదా కార్యకలాపాలను ఏ వ్యక్తి చేయకూడదు లేదా కొనసాగించకూడదు.. ఇదే నిజమైతే గంగానదిపై ఆధారపడి బతుకుతున్న అందరి జీవితాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఈ సంఘటన సమాజానికి సిగ్గుచేటు.. అంతేకాదు ఇది మృతిచెందిన వ్యక్తుల మానవహక్కుల ఉల్లంఘనే ' అని జాతీయ మానవహక్కుల కమిషన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి సంఘటనలను నివారించడంలో విఫలమైన నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు కమిషన్‌ను కోరారు.
గంగానదిలో మృతదేహాలు కొట్టుకువచ్చిన ఘటనపై సిట్టింగ్ లేదా రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు ప్రదీప్‌కుమార్ యాదవ్, విశాల్ ఠాక్రే గురువారం దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా పోవాలంటే కొందరు గోమూత్రం తాగాలని లేదా ఆవు పేడను ఒంటికి పూసుకోవాలని ప్రచారానికి పూనుకుంటున్నారు. ఇలాంటి వారి పై కూడా ఎన్ హెచ్ ఆర్సీ దృష్టి పెడితే దేశం బాగుపడుతుందని ప్రజలు కోరుతున్నారు.