NGT: కేంద్ర పర్యావరణశాఖపై ఎన్జీటీ తీవ్ర వ్యాఖ్యలు
NGT: సీమ ఎత్తిపోతల ప్రాజెక్టులపై నివేదిక ఎందుకు ఇవ్వలేదని ఆగ్రహం * ఫొటోలు చూస్తే నిబంధనలు ఉల్లంఘించినట్టు తెలుస్తోందన్న ఎన్జీటీ
NGT: ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పనులపై, కృష్ణా నది యాజమాన్య బోర్డుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అసహనం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారా అంటూ కేఆర్ఎంబీ పై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేసింది. సీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి దాఖలైన పిటిషన్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్‌లో విచారణ కొనసాగింది. ప్రాజెక్టును ఇటీవల క్షేత్రస్థాయిలో సందర్శించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు నివేదికను రూపొందించింది. అయితే.. ఆ నివేదిక ట్రిబ్యునల్ కు చేరలేదు. కేఆర్ఎంబీ రూపొందించిన నివేదికలోని ఫొటోలను తెలంగాణ ప్రభుత్వం ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లింది. ఎన్జీటి నిబంధనలను ఉల్లంఘించి ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులను చేసిందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరింది.
ఎన్జీటీ మొదటగా కేంద్ర పర్యావరణ శాఖపై మండిపడింది. సీమ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులున్నాయా..? లేవా.? అనే దానిపై నివేదిక సమర్పించాలని గత జూన్‌లోనే ఆదేశాలు జారీ చేసినా కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఇప్పటికీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ లో ఆదేశాలు ఇస్తే ఇప్పటివరకు ఎందుకు నివేదిక ఇవ్వలేదని నిలదీసింది. ఏపీ సర్కారుతో కుమ్మక్కయ్యారా.? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత ఏపీ సర్కారుపై గ్రీన్ ట్రిబ్యునల్ నిప్పులు చెరిగింది. తెలంగాణ ప్రభుత్వం అందజేసిన ఫొటోలను పరిశీలిస్తే ప్రాజెక్టు పనులు ఎక్కువగానే జరిగినట్టు తెలుస్తుందని, కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్టు స్పష్టమవుతున్నదని పేర్కొంది. కేఆర్ఎంబీ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించాక ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. కేసు విచారణ ఈనెల 27కు ఎన్జీటీ వాయిదా వేసింది.