పార్లమెంట్ నూతన భవనం భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని మోడీ అన్నారు. కొత్త భవనంలో ఎన్నో విశిష్టతలు ఉండబోతున్నాయని తెలిపారు. ఈ రోజు భారతీయులకు చరిత్రాత్మక దినమని చెప్పారు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఈ రోజు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన 75ఏళ్ల సందర్భానికి గుర్తుగా ఈ భవనం నిలవనుందన్నారు.
కొత్త పార్లమెంట్ భవనం ఆత్మ నిర్భర్ భారత్‌కు సాక్ష్యంగా నిలవనుందని ప్రధాని మోడీ అన్నారు. 21వ శతాబ్ధపు భారత ప్రజల ఆకాంక్షలు కొత్త పార్లమెంట్ భవనం ద్వారా నెరవేరుతాయని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండియా గేట్‌కు సమీపంలో ఉన్న నేషనల్ వార్ మెమోరియల్ ఏ విధమైన ప్రత్యేకతను సంతరించుకుందో అదే విధంగా కొత్త పార్లమెంట్ భవనం తన ప్రత్యేకతను చాటుకోనుందని ప్రధాని ఆకాంక్షించారు.
కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం తర్వాత పార్లమెంట్ సభ్యుల పనితీరు మెరుగుపడుతుందని ప్రధాని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. తమ తమ నియోజకవర్గాల నుంచి వచ్చే ప్రజల సమస్యలు తెలుసుకోడానికి ప్రస్తుత పార్లమెంట్ భవనంలో కొంత ఇబ్బంది ఉందని...కొత్త భవనంలో అటువంటి ఇబ్బందులుండవని మోడీ తెలిపారు. తమ కష్టాలను వివరించడానికి వచ్చిన ప్రజలను ప్రజాప్రతినిధులు ఎటువంటి అసౌకర్యం లేకుండా కలుసుకోవచ్చని వివరించారు.
ప్రస్తుత పార్లమెంట్ భవనం ప్రత్యేకతను ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. రాజ్యాంగ రచన ఇక్కడే జరిగిందని అంబేద్కర్‌తో పాటు పలువురు మహనీయులు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లోనే రాజ్యాంగ రచన చేశారని గుర్తుచేసుకున్నారు. ఎన్నో చరిత్రాత్మక మార్పులకు ప్రస్తుత పార్లమెంట్ సాక్షిగా నిలిచిందని అన్నారు.