నేడు నేతాజీ సుభాష్‌చంద్రబోస్ 125వ జయంతి
*నేతాజీకి నివాళులు అర్పించనున్న ప్రధాని మోడీ *ఢిల్లీ ఇండియా గేట్ వద్ద సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ ఆవిష్కరణ
Narendra Modi: నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మోడీ ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈరోజు నేతాజీ జయంతి సందర్భంగా నేటి నుంచే రిపబ్లిక్ వేడుకలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అలాగే సాయంత్రం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు. నిజానికి గ్రానైట్‌తో తయారు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించాలి కానీ విగ్రహానికి సంబంధించిన పనులు పూర్తికాలేదు. దీంతో ఆ ప్రదేశంలోనే నేతాజీ హోలోగ్రామ్ విగ్రహం ఉండనుంది.
ఈ హోలోగ్రామ్ విగ్రహం 30 వేల ల్యూమెన్స్ 4కే ప్రొజెక్టర్‌తో పనిచేస్తుంది. 90 శాతం పారదర్శకమైన హోలోగ్రాఫిక్ స్క్రీన్ సందర్శకులకు కనిపించని విధంగా ఏర్పాటు చేశారు. హోలోగ్రామ్ విగ్రహం సైజ్ 28 అడుగుల ఎత్తు, 6 అడుగుల వెడల్పు ఉంటుంది. దీని ప్రభావం సృష్టించడానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ 3D చిత్రం దానిపై ప్రదర్శించబడుతుంది.
ఈ కార్యక్రమంలో సుభాస్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ అవార్డులను మోడీ అందజేయనున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ రంగంలో భారతదేశంలోని వ్యక్తులు , సంస్థలు అందించిన సేవలను గుర్తించి కేంద్రం వార్షిక సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాన్ని ఏర్పాటు చేసింది. అవార్డు గ్రహీతలకు 51 లక్షల రూపాయల నగదు బహుమతి , ప్రశంసాపత్రాన్ని అందజేయనున్నారు.