NEET 2021: నేడే దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష
NEET 2021: నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 16లక్షల మంది విద్యార్థులు
NEET 2021: మెడికల్ కాలేజీలో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ టెస్ట్ ఇవాళ జరుగనుంది. దేశ వ్యాప్తంగా సుమారు 16లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. 202 పట్టణాల్లో 3,842 కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. పెన్నూ పేపరు విధానంలో నిర్వహించే ఈ పరీక్ష మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనుంది. మధ్యాహ్నం 1.30గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించబోమని అధికారులు వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్నారు. దీంతో ఏపీలోని 9పట్టణాల్లో 151 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. తెలంగాణలో 7 పట్టణాల్లో 112 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, ఫొటో, గుర్తింపు కార్డు మాత్రమే అనుమతించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టంచేసింది. మాస్కు తప్పనిసరని, చిన్న శానిటైజర్ బాటిల్‌ను కూడా అనుమతిస్తామని తెలిపింది.
పరీక్ష రాసే విద్యార్థులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్ ఎన్టీయే ప్రకటించింది. అబ్బాయిలు పొడుగు చేతుల చొక్కాలు, షూ ధరించరాదని షరతు విధించింది. ఇక అమ్మాయిలైతే చెవిపోగులు, గొలుసులు వంటి ఆభరణాలు పెట్టుకోరాదని ఆదేశించింది. హిందీ, ఆంగ్లంతో పాటు మొత్తం 11 ప్రాంతీయ భాషల్లో ఈ పరీక్ష జరగనుంది. కరోనా నేపథ్యంలో అభ్యర్థులకు థర్మల్ స్క్రీనింగ్ కూడా చేయనున్నారు.