Sameer Khan: నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ మృతి

Update: 2024-11-03 14:10 GMT

Nawab Malik's son in law Sameer Khan: ఎన్సీపీ కీలక నేత, మాజీ మంత్రి నవాబ్ మాలిక్ అల్లుడు సమీర్ ఖాన్ చనిపోయారు. సొంత వాహనం డ్రైవర్ అబ్ధుల్ అన్సారీ సెప్టెంబర్ 18న సమీర్ ఖాన్‌ని ఢీకొట్టిన విషయం తెలిసిందే.ముంబైలోని క్రిటికేర్ ఆస్పత్రి బయట సమీర్ ఖాన్ తన భార్య నీలోఫర్‌తో కలిసి తమ వాహనం కోసం వేచిచూస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన సమీర్ ఖాన్ అప్పటి నుండి ఆస్పత్రిలోనే క్రిటికల్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడం, ఛాతి ఎముకలు విరిగిపోవడంతో పాటు అనేక గాయాలయ్యాయి. ఆదివారం పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.

సమీర్ ఖాన్‌ని ఢీకొన్న ఎస్‌యూవీ కారు ఆయన్ని 10-15 అడుగుల వరకు ఈడ్చుకెళ్లింది. తాను పొరపాటున బ్రేక్ తొక్కబోయి యాక్సిలరేటర్ తొక్కానని డ్రైవర్ అబ్దుల్ అన్సారీ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. వినోభా భావె నగర్ పోలీసు స్టేషన్‌లో అన్సారీైపై కేసు నమోదైంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఒకరికి ప్రాణహాని కలిగించిన సెక్షన్ల కిందే ఇప్పటివరకు అన్సారీపై దర్యాప్తు నడుస్తోంది. ఇప్పుడు సమీర్ ఖాన్ మృతితో ఈ కేసులో కొత్త సెక్షన్స్ వచ్చి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం నవాబ్ మాలిక్ మహారాష్ట్ర ఎన్నికలతో బిజీగా ఉన్నారు. అజిత్ పవార్ వర్గమైన ఎన్సీపీలో ఆయన చురుగ్గా వ్యవహరిస్తున్నారు. అల్లుడు సమీర్ ఖాన్ మృతిపై నవాబ్ మాలిక్ స్పందించారు. అల్లుడు సమీర్ మృతి చెందారన్న బాధలో ఉన్న తాను, తరువాతి రెండు రోజుల పాటు చేపట్టనున్న అన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకుంటున్నట్లు ఎక్స్ ద్వారా తెలిపారు.


Tags:    

Similar News