Aero India 2023: నవ భారత సామర్థ్యానికి బెంగళూరు ఆకాశమే సాక్షి..
Aero India 2023: భారత్ విస్తరిస్తున్న సామర్థ్యాలకు ఎయిరో ఇండియా ఒక ఉదాహరణ
Aero India 2023: భారతదేశం విస్తరిస్తున్న సామర్థ్యాలకు ఎయిరో ఇండియా ఒక ఉదాహరణ అని ప్రధాని మోడీ తెలిపారు. బెంగళూరులో జరిగిన ఎయిరో ఇండియా 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు. ఐదు రోజుల పాటు జరిగే ఎయిరో ఇండియా 2023 ప్రదర్శనను ఆయన బెంగళూరులో ఆవిష్కరించారు. నవ భారత సామర్థ్యానికి బెంగళూరు ఆకాశమే సాక్షి అని మోడీ వెల్లడించారు. నేడు దేశం కొత్త శిఖరాలను తాకుతోందన్నారు.
ఎయిరో ఇండియా షోలో 100 దేశాలు పాల్గొంటున్నాయంటే భారత్‌పై ప్రపంచానికి నమ్మకం పెరిగిందని చెప్పవచ్చన్నారు. దేశ, విదేశాల నుంచి 700 మందికిపైగా ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారని, గత రికార్డులన్నింటినీ ఇది బద్దలు కొట్టిందని మోడీ చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ పరిజ్ఞానంతో విమానాలను తయారుచేస్తున్నామని తెలిపారు. తక్కువ ఖర్చుతోనే రక్షణ రంగ విడిభాగాలను తయారుచేస్తున్నామన్నారు. ప్రపంచ దేశాలకు రక్షణ రంగ విడిభాగాల ఎగుమతులను ఆరు రెట్లు పెంచామని మోడీ వెల్లడించారు. ప్రైవేట్ కంపెనీలు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టాలన్నారు.