By Election Campaign: నేటితో ముగియనున్నఉపఎన్నికల ప్రచారం గడువు
By Election Campaign: ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది.
By Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఉపఎన్నికల పోరు ప్రచార పర్వానికి నేటితో తెరపడనుంది. కరోనా కోరలు చాస్తున్నప్పటికీ నువ్వా నేనా అన్నట్లు అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ లోని తిరుపతి లోక్ సభ, తెలంగాణ లోని నాగార్జున సాగర్ శాసనసభ ఉప ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. ఈ నెల 17న తిరుపతి పార్లమెంట్, సాగర్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరుగుతుంది. చివరి అస్త్రంగా ఆయా పార్టీలు రెండు చోట్లా సర్వశక్తులూ ఒడ్డుతూ ప్రచారం ఉదయం నుంచే నిర్వహించడం షురూ చేశాయి. ఇప్పటికే అల్టిమేట్ క్యాంపెయిన్ అన్నట్టు తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాగర్ లో సమరశంఖం పూరించేశారు. అటు, తిరుపతిలో మాత్రం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా నేపథ్యాన్ని చూపుతూ ప్రచారం, బహిరంగ సభను రద్దు చేసుకున్నప్పటికీ వైసీపీ మంత్రులు, నేతలు ఊపిరిసలపని ప్రచారం నిర్వహిస్తూ తమ పార్టీ అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తున్నారు.
ఇక, తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల బరిలో అధికారపార్టీ వైసీపీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఎఎస్ అధికారిని రత్నప్రభ, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ చింతామోహన్ బరిలో ఉన్నారు. టిడిపి తిరుపతి లోక్ సభ స్థానాన్ని ఎలాగైనా తన ఖాతాలో వేసుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తోంది. సిట్టింగ్ స్థానాన్ని 5లక్షల మెజారిటీతో ఎలాగై నిలబెట్టుకోవాలని వైసీపీ, పవన్ కళ్యాణ్ వేవ్ తో డిపాజిట్లు తగ్గించుకునే పనిలో బిజెపి తహతహలాడుతున్నాయి.
అటు, నాగార్జున సాగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచి దివంగత నోముల నర్శింహయ్య తనయుడు నోముల భగత్, కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ నుంచి రవినాయక్ తమతమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రచారంలో మూడు పార్టీల మధ్య రాజకీయ విమర్శల తీరు ఎలా ఉన్నప్పటికీ, జానారెడ్డి వర్సెస్ టీఆర్‌ఎస్, జానారెడ్డి వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే పరిస్థితి ఉంది. వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతున్నప్పటికీ, సాగర్‌లో ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డిని అధికార టీఆర్‌ఎస్ విస్మరించే వాతావరణం లేదు. తమకు పోటీ టీఆర్‌ఎ్‌సతోనే అని బీజేపీ బయటికి చెబుతున్నా.. ఆ పార్టీ కూడా జానారెడ్డిని పట్టించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ పరంగా కాకుండా.. జానారెడ్డికి వ్యక్తిగతంగా, రాజకీయంగా ఉన్న బలమే ప్రధానం కానుంది. టీఆర్‌ఎస్ విషయంలో అభ్యర్థి కంటే పార్టీయే బలమైనది. అందుకే..'జానారెడ్డికి పార్టీ లేదు. టీఆర్‌ఎ్‌సకు అభ్యర్థి లేడు' అని క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్ రెండు పార్టీల నేతలు పలువురు చమత్కరిస్తున్నారు. ఏదీ ఏమైనప్పటికీ అధికారంలో వున్న పార్టీలకు ఈ ఎన్నికలు పెద్ద పరీక్షలానే కనిపిస్తున్నాయి. మరళా తమ స్థానాలను నెలబెట్టుకుని పురువు నిలుపుకుంటారా లేదా వేచి చూడాల్సిందే.