Threat to Salman Khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల కేసులో కూరగాయల వ్యాపారి అరెస్ట్
Threat to Salman Khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపుల కేసులో ముంబై పోలీసులు పురోగతి సాధించారు. సల్మాన్ ఖాన్ రూ. 5 కోట్లు ఇస్తే ఆయన్ని వదిలేస్తామని, లేదంటే ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖికి పట్టిన గతే పడుతుందని గుర్తు తెలియని దుండగులు వాట్సాప్ ద్వారా బెదిరించిన విషయం తెలిసిందే. అక్టోబర్ 17న ముంబై ట్రాఫిక్ పోలీసులకు వాట్సాప్ ద్వారా ఈ మెసేజ్ వచ్చింది. ట్రాఫిక్ పోలీసులకు మెసేజ్ వచ్చిన ఘటనపై ముంబైలోని వొర్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వొర్లి సీనియర్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర కాట్కర్ ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటి నుండి ఆ మెసేజ్ వెనుకున్న నిందితుడిని పట్టుకునే పనిలో బిజీ అయ్యారు. వాట్సాప్ మెసేజ్ పంపించిన నెంబర్ ఆధారంగా ముంబై పోలీసులు నిందితుడి కాల్ డేటా తీశారు. అలా ఆ వ్యక్తి అడ్రస్ ఆరా తీయగా జంషెడ్‌పూర్‌లో కూరగాయలు అమ్ముకునే హుస్సేన్ షేక్ అని తెలిసింది.
వెంటనే ముంబై పోలీసుల బృందం జంషెడ్‌పూర్ వెళ్లింది. ముంబై పోలీసులు జంషెడ్‌పూర్ వచ్చి కాల్ డేటా ఆధారంగా తన ఆచూకీ కనుక్కుంటున్నారని తెలుసుకున్న హుసేన్ షేక్ అక్కడ నుండి పరారయ్యారు. కానీ పోలీసులు ఎలాగోలా హుసేన్ షేక్‌ను పట్టుకుని జంషెడ్‌పూర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. నిందితుడిని ముంబై తీసుకువచ్చేందుకు అక్కడి కోర్టు ట్రాన్సిట్ ఆర్డర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్సిట్ ఆర్డర్ రావడంతో నిందతుడిని తీసుకుని ముంబై బయల్దేరారు.
హుస్సేన్ షేక్ అక్టోబర్ 19న.. అంటే బెదిరింపు మెసేజ్ పంపించిన మరో రెండు రోజులకే ఇంకో మెసేజ్ పంపించారు. తప్పయింది తనని క్షమించండి ఈసారి ముంబై పోలీసులను వేడుకున్నారు. ఇదిలావుంటే, సల్మాన్ ఖాన్‌ను ఎప్పటి నుండో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చంపుతామని బెదిరిస్తోంది. ఆ క్రమంలోనే అక్టోబర్ 12న సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహిత మిత్రులైన బాబా సిద్ధిఖిని కాల్చి చంపారు. బాబా సిద్ధిఖి మర్డర్ తరువాత 5 రోజులకే ఈ బెదిరింపు మెసేజ్ రావడంపై ముంబై పోలీసులు తీవ్రంగా పరిగణించారు. అందుకే ఆ నెంబర్ ఆధారంగా నిందితుడిని వెదుక్కుంటూ వెళ్లి అరెస్ట్ చేశారు. హుస్సేన్ షేక్ పొరపాటున ఈ పని చేశారా లేక లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.