హనుమాన్ చాలీసా వివాదంలో నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్...

Navaneet Kaur: వారి నివాసం వద్ధ భద్రతను పెంచిన పోలీసులు...

Update: 2022-05-04 11:55 GMT

హనుమాన్ చాలీసా వివాదంలో నవనీత్ కౌర్ దంపతులకు బెయిల్...

Navaneet Kaur: మహారాష్ట్రలో మైకుల వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. మసీదుల్లో మైకులను మే 3లోగా తొలగించాలని ఎంఎన్‌ఎస్‌ అధినేత రాజ్‌ థాక్రే హెచ్చరించిన ముంబైలో భద్రతను భారీగా పెంచారు. మరోవైపు సీఎం ఉద్దవ్‌థాక్రే నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్‌ చాలీసా పఠిస్తామని హెచ్చరించిన ఎంపీ నవనీత్‌ కౌర్‌ దంపతులకు బెయిల్‌ మంజూరయింది. ఈ నేపథ్యంలో ఆలయాలు, మసీదుల వద్ద ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తుగా పోలీసులను భారీగా మోహరించారు.

ఈ నేపథ్యంలో సమస్య సామాజికమైనదని.. శబ్ద కాలుస్యాన్ని నివారించాల్సిందేనని.. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఉద్దేశం తనకు లేదని రాజ్‌థాక్రే తెలిపారు. మసీదుల్లో అజాన్‌ పఠిస్తే.. ఆలయాల్లో హనుమాన్‌ చాలీసా తప్పకుండా వినిపిస్తామని మరోసారి హెచ్చరించారు. ముంబైలో ఎన్నో మసీదులను అక్రమంగా నిర్మించారని.. వాటికి అనుమతులు ఎలా ఇచ్చారని రాజ్‌థాక్రే ప్రశ్నించారు. భారీ సౌండ్‌తో మసీదుల్లో ఆజాన్‌ పఠిస్తున్నారని మండిపడ్డారు.

సాధారణంగా అనుమతినిచ్చిన 45 నుంచి 55 డెసిబెల్స్‌ సౌండ్స్‌తో ఆజాన్‌ పఠిస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మసీదుల్లో పెట్టిన మైకులను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు. ముంబైలో ఎన్నో ఆలయాలు ఉన్నాయని.. వాటిలో నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఒక్క మైకు కూడా లేదన్నారు. ఇది మత సంబంధమైన సమస్య కాదని.. కేవలం సామాజిక సమస్యని మాత్రమే ఎత్తి చూపుతున్నానని రాజ్‌ థాక్రే స్పష్టం చేశారు.

తాము రాష్ట్రంలో శాంతిని కోరుకుంటున్నామని.. అయితే పోలీసులు మాత్రం తమ పార్టీ కార్యకర్తలను అకారణంగా అరెస్టు చేస్తూ.. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంగిస్తున్నట్టు ఆరోపించారు. మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లను తొలగించకపోతే.. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాక్రే నివాసం మాతోశ్రీ ఎదుట హనుమాన్ చాలీసాను పఠిస్తామని ఎంపీ నవనీత్‌ కౌర్‌, భర్త రవిరాణా హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో శివసైనికులు రెచ్చిపోయారు. నవనీత్‌ కౌర్‌ ఇంటి ఎదుట భారీగా ఆందోళనలు చేశారు.

ఆమె ఇంట్లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. మత ఘర్షణలు రేపేలా వ్యాఖ్యలు చేశారంటూ మహారాష్ట్ర పోలీసులు వారిని అరెస్టు చేశారు. ముంబై కోర్టు వారికి 14 రోజుల కస్టడీ విధించింది. ఇవాళ కస్టడీ ముగియడంతో బెయిల్‌పై నవనీత్‌ కౌర్‌, ఆమె భర్త రవి రాణా భయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో నవనీత్‌ ఇంటి ఎదుట పోలీసులు భద్రతను పెంచారు.

Tags:    

Similar News