MP High Court Innovative Conditions : రాఖీ కట్టించుకుని రూ. 11 వేలు ఇవ్వు : హై కోర్టు తీర్పు

MP High Court Innovative Conditions : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసేందుకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు వినూత్న షరతులను పెట్టింది.

Update: 2020-08-03 08:01 GMT
మధ్యప్రదేశ్ హై కోర్టు ఫైల్ ఫోటో

MP High Court Innovative Conditions : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ నిందితుడికి బెయిల్‌ మంజూరు చేసేందుకు మధ్యప్రదేశ్‌ హైకోర్టు వినూత్న షరతులను పెట్టింది. దేశ వ్యాప్తంగా ఈ నెల3న రక్షా బంధన్‌ సంబరాలను జరుపుకుంటారని, ఆ రోజున నిందితుడు బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె చేత రాఖీ కట్టించుకోవాలని ఆదేశించింది. అంతేగాక రాఖీ కట్టినందుకు బాధితురాలికి ఆడపడుచు కానుకల కింద రూ. 11 వేల నగదును ఇవ్వాలని పేర్కొంది. దాంతో పాటుగానే ఆమె కొడుకుకు కూడా మరో రూ. 5 వేల నగదును ఇవ్వాలని తెలిపింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఇవన్నీ పూర్తి చేసి సంబంధించిన రసీదులు, ఫొటోలు, కోర్టుకు సమర్పించాలని తెలిపింది. ఈ షరతులు కేవలం బెయిలు పొందేందుకు మాత్రమే వర్తిస్తాయని తెలిపింది. ఈ అంశాలు తదుపరి విచారణపై ఎటువంటి ప్రభావం చూపవని స్పష్టం చేసింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాల్లోకెళితే ఈ ఏడాది జూన్‌లో ఓ వ్యక్తిపై మధ్యప్రదేశ్ లో లైంగిక ఆరోపణల కింద కేసు నమోదైంది. ఓ యువకుడు పొరుగింట్లోకి ప్రవేశించి మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడినట్లు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేశారు. కాగా ఆ వ్యక్తి కోర్టులో బెయిల్ కోసం అర్జీ పెట్టుకున్నారు. ఈ కేసును ఇండోర్‌ ధర్మాసనం జూలై 30న విచారించి రూ. 50 వేల పూచీకత్తు కింద బెయిలు మంజూరు చేసింది. అంతే కాదు బెయిల్ మంజూరు చేస్తూ కొన్ని షరతులను కూడా పెట్టింది. ''నిందితుడు తన భార్యతో కలిసి ఆగష్టు 3, 2020న ఉదయం 11 గంటలకు బాధితురాలి ఇంటికి వెళ్లాలని తెలిపింది. రాఖీ సందర్భంగా బాధితురాలి చేత రాఖీ కట్టించుకోవాలంది. అంతే కాదు అన్ని వేళల్లోనూ ఆమెకు అన్ని విధాలుగా అండగా, రక్షగా ఉంటాననే హామీ ఇవ్వాలని తెలిపింది. రాఖీ కట్టించుకుని సాంప్రదాయం ప్రకారం కానుకగా రూ. 11 వేలు ఇవ్వాలంది. బాధితురాలి కొడుకుకు కూడా ఖర్చుల కోసం మరో రూ. 5 వేలు ఇవ్వాలంది. కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సామాజిక దూరం, మాస్కు ధరించడం, పరిశుభ్రత వంటి నిబంధనలు పాటించాలని జస్టిస్‌ రోహిత్‌ ఆర్య పేర్కొన్నారు.



Tags:    

Similar News