CoWin: తొలిరోజే విశేష స్పందన

CoWin: దేశంలో రెండో దశ టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఇందుకోసం కోవిన్‌ పోర్టల్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.

Update: 2021-03-01 13:42 GMT
కోవిన్ పోర్టల్ (ఫోటో ట్విట్టర్)

CoWin: దేశంలో రెండో దశ టీకా పంపిణీ సోమవారం ప్రారంభమైంది. ఇందుకోసం కోవిన్‌ పోర్టల్‌ను నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే.. మొదటి రోజే విశేష స్పందన లభించింది. కేవలం 4 గంటల్లోనే 10లక్షల మందికి పైగా కోవిన్ పోర్టల్, యాప్ లో నమోదు చేసుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు 10లక్షల మందికి పైగా ఈ పోర్టల్‌ ద్వారా టీకా కోసం అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

టీకా తీసుకోవాలనుకునేవారు www.cowin.gov.in లేదా ఆరోగ్యసేతు యాప్‌ ద్వారా తమ పేరు నమోదు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. లేదంటే సమీప వ్యాక్సిన్‌ కేంద్రాలకు వెళ్లి కూడా టీకా కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతానికి కొవిన్‌ యాప్‌లో సామాన్య ప్రజలకు నమోదు ప్రక్రియ అందుబాటులో లేదని ఆరోగ్యశాఖ తెలిపింది.

రెండోదశలో భాగంగా 60ఏళ్లు పైబడిన వారితోపాటు 45-59ఏళ్ల మధ్యవయస్సు గల వారిలో దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు నేటి నుంచి వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సహా కొంతమంది ప్రముఖులు కూడా నేడు టీకా వేయించుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటులోనూ వ్యాక్సిన్‌ వేసుకోవచ్చని కేంద్రం వెల్లడించింది. ప్రైవేటులో టీకా ఒక్కో డోసు ధర రూ. 250గా నిర్ణయించిన విషయం విదితమే.

Tags:    

Similar News