Aryan Khan - Drugs Case: కీలక మలుపు తిరుగుతున్న ఆర్యన్‌ఖాన్ వ్యవహారం
Aryan Khan - Drugs Case: షారుక్ నుంచి ఎన్‌సీబీ రూ. 25 కోట్లు డబ్బు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు...
Aryan Khan - Drugs Case: బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో షారుక్ నుంచి డబ్బు డిమాండ్ చేశారన్న అంశంపై ఆరోపణల నేపథ్యంలో ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే సోమవారం ఢిల్లీ చేరుకున్నారు.
ఎయిర్ పోర్టు మీడియా ఆయన్ను చుట్టుముట్టి ఏదైనా దర్యాప్తు సంస్థ సమన్లు ఇచ్చిందా? అని అడిగిన ప్రశ్నల్ని ఆయన కొట్టిపారేశారు. ఢిల్లీలో తనకు పని ఉండటం వల్లే వచ్చానని స్పష్టంచేశారు. తన దర్యాప్తుపై వందశాతం కట్టుబడి ఉన్నట్టు వాంఖడే చెప్పారు.
షారుక్ నుంచి ఎన్‌సీబీ 25 కోట్ల రూపాయల డబ్బు డిమాండ్ చేసినట్టు ప్రభాకర్ సాయిల్ అనే ప్రత్యక్ష సాక్షి సంచలన ఆరోపణలు కలకలం రేపాయి. దీంతో సమీర్ వాంఖడేపై విచారణ ప్రారంభమైనట్టు ఎన్‌సీబీ డిప్యూటీ డీజీ తెలిపారు. ఆయనపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయన్నారు. ఇప్పుడే విచారణ ప్రారంభించామని.. అయితే, ఆ పదవిలో సమీర్ వాంఖడే కొనసాగుతారో? లేదో చెప్పడం మాత్రం తొందరపాటే అవుతుందన్నారాయన.
ఆ దాడి సమయంలో తాను కేపీ గోసావి అనే వ్యక్తితో కలిసి ఘటనాస్థలికి వెళ్లానని ఎన్‌సీబీ తరఫు 9మంది సాక్షుల జాబితాలో ఉన్న ప్రభాకర్ తెలిపారు. ఎన్‌సీబీ తరఫున మరో సాక్షిగా ఉన్న గోసావికి తాను వ్యక్తిగత అంగరక్షకుడిగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఆర్యన్‌ను ఎన్‌సీబీ కార్యాలయానికి తీసుకొచ్చాక శామ్ డిసౌజా అనే వ్యక్తితో గోసావి ఫోన్‌లో మాట్లాడాడని, 25 కోట్లు డిమాండ్ చేయాలని అతడికి చెబుతుండగా విన్నట్టు చెప్పారు. చివరకు 18 కోట్లకు ఖరారు చేయమని, అందులో 8 కోట్లు వాంఖడేకు ఇవ్వాల్సి ఉందని డిసౌజాకు గోసావి చెప్పాడన్నారు.
ఆ తర్వాత గోసావి, డిసౌజాలను షారుక్ మేనేజర్ కలిశారని చెప్పారు. గోసావికి ఇద్దరు వ్యక్తులు 50 లక్షలు ఇచ్చారని, అందులో 38 లక్షలు తిరిగి ఇచ్చాడని.. ఈ వివరాలన్నింటినీ తాను కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు తెలిపారు. తనతో వాంఖడే, గోసావి 10 ఖాళీ పేపర్లపై సంతకాలు చేయించుకున్నారని వెల్లడించారు.
ప్రస్తుతం గోసావి ఆచూకీ తెలియడం లేదని, అందుకే ప్రాణ భయంతో తాను ఈ విషయాలను బహిర్గతం చేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ ఆరోపణల్ని ఎన్‌సీబీ తోసిపుచ్చింది.