గేదెపై ఎన్నికల ప్రచారం చేశాడు.. పోలీసులు జైల్లో వేశారు!
Mohammad Parvez Mansoori : బీహార్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా ఓ గేదెపై ఎక్కి వీధుల్లో తిరుగుతూ ఓ అభ్యర్థి ప్రచారం చేశాడు. ఇలా ప్రచారం చేస్తున్న ఆ అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Mohammad Parvez Mansoori : బీహార్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రచార పర్వంలో భాగంగా ఓ గేదెపై ఎక్కి వీధుల్లో తిరుగుతూ ఓ అభ్యర్థి ప్రచారం చేశాడు. ఇలా ప్రచారం చేస్తున్న ఆ అభ్యర్థిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గయా పట్టణంలో రాష్ట్రీయ ఉలేమా కౌన్సిల్ పార్టీ అభ్యర్థి మహ్మద్ పర్వేజ్ మన్సూరి తన ప్రచారపర్వంలో భాగంగా గేదెపై తిరిగారు. గేదెపై ఎక్కిన అభ్యర్థి మహ్మద్ పర్వేజ్‌పై జంతువుల క్రూరత్వ నిరోధక చట్టం, కొవిడ్-19 మార్గదర్శకాల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.
అభ్యర్థి పర్వేజ్ గాంధీ మైదానం నుంచి స్వరాజ్ పురి రోడ్డుకు చేరిన వెంటనే పోలీసులు అతన్ని అరెస్టు చేసి బెయిలుపై విడుదల చేశారు. పర్వేజ్ పై ఐపీసీ సెక్షన్ 269, 270 ల కింద కేసు నమోదు చేశారు. తనను గయా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే పట్టణాన్ని కాలుష్య రహితంగా మారుస్తానని పర్వేజ్ ప్రచారం సాగిస్తున్నారు.
30 ఏళ్లుగా ఎన్డీఏ అభ్యర్థి ప్రేమకుమార్, 15 ఏళ్లుగా గయా డిప్యూటీ మేయరుగా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి మోహన్ శ్రీవాస్తవ గయా అభివృద్దిని విస్మరించారని పర్వేజ్ ఆరోపించారు. మహ్మద్ పర్వేజ్ తోపాటు అతని మద్ధతుదారులపై సివిల్ లైన్సు పోలీసుస్టేషనులో కేసు నమోదు చేశామని గయా జిల్లా ఎస్పీ రాజీవ్ మిశ్రా చెప్పారు. ఎన్నికల ప్రచారానికి జంతువులను ఉపయోగించరాదని ఎన్నికల కమిషన్ సూచించిందని, దీన్ని ఉల్లంఘించిన పర్వేజ్ పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.