Modi Cabinet: పిలిచి పిల్లనిస్తామంటోంది బీజేపీ.. వైసీపీ ఎందుకు వద్దంటోంది?
Modi cabinet: పిలిచి పిల్లనిస్తామంటే వద్దన్న చందంగా కనిపిస్తోందట వైసీపీ తీరు.
Modi cabinet : పిలిచి పిల్లనిస్తామంటే వద్దన్న చందంగా కనిపిస్తోందట వైసీపీ తీరు. తీసుకోండి, ఏలుకోండి, భాగస్వాములు కండి అంటూ మోడీ సర్కారు బంపర్ ఆఫర్ ఇస్తుంటే, వద్దు వద్దు అంటూ, దూరం దూరం జరుగుతోందట వైసీపీ. ఏమిస్తామంటోంది కాషాయ పార్టీ...? ఎందుకు నో అంటోంది వైఎస్‌ఆర్ సీపీ?
కేంద్రంలో వైసీపీ చేరుతుందనే ప్రచారం ఇప్పటికే చాలాసార్లు వినిపించింది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీతో భేటీ అయిన ప్రతి సందర్భంలోనూ, ఇక ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. కేంద్రంతో వైసీపీ ప్రభుత్వం ముందు నుంచి సత్సంబంధాలనే కొనసాగిస్తోంది. అంతేకాకుండా జాతీయ బీజేపీ నేతలతో కూడా వైసీపీకి గుడ్ రిలేషన్సే వన్నాయి. రాష్ట్ర బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించినా, వైసీపీ పెద్దగా కౌంటర్ అటాక్ చేయడం లేదు. లోక్‌సభ, రాజ్యసభల్లోనూ బీజేపీ ప్రవేశపెట్టే బిల్లులకు వైసీపీ మద్దతు ఇస్తూనే వుంది. లోక్‌సభలో వైసీపీకి 22 మంది ఎంపీల బలం ఉంది. ఇటు రాజ్యసభలోనూ తాజా గెలుపుతో సభ్యుల సంఖ్య రెండు నుంచి ఒక్కసారిగా ఆరుకు పెరిగింది. దీంతో వైసీపీతో అధికారికంగా చేతులు కలిపేందుకు బీజేపీ పెద్దలు ఉత్సాహం చూపుతున్నట్లు, ఢిల్లీ సర్కిల్స్‌లో వినపడుతోంది.
అయితే జగన్ మాత్రం బీజేపీతో చేతులు కలపటానికి సుముఖంగా లేరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి వైసీపీ గెలుపు పునాదులు దళితులు, మైనార్టీ ఓట్ బ్యాంక్ పైనే ఉన్నాయి. సామాజికంగా ఈ రెండు వర్గాలకు బీజేపీ అంటే వ్యతిరేక అభిప్రాయం ఉండటంతో, రాష్టంలో రాజకీయంగా నష్టం కనుక, ఆ పని జగన్ చెయ్యడం లేదనేది పార్టీ నేతల మాటలు. దీంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే ఎవరితోనైనా చేతులు కలపటానికి సిద్ధమని, గతంలో అనేక సందర్భాల్లో జగన్ స్వయంగా ప్రకటించారు. ప్రత్యేక హోదాపై ఎటువంటి భరోసా లేకుండా బీజేపీతో కలిస్తే అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందన్నది ఒక వాదన. అందుకే కాషాయంతో చేతులు కలపడం ఎందుకన్నది జగన్ ఆలోచన కావొచ్చు.
ఇలా రెండు ప్రధాన కారణాలతో బీజేపీతో బాహ్య సంబంధాలు పెట్టుకునే సాహసం సీఎం జగన్ చెయ్యడం లేదనేది పార్టీ వర్గాల్లో నడుస్తున్న చర్చ. బీజేపీ పిలిచి పదవులు ఇస్తానంటున్నా పొలిటికల్ వ్యూహంతోనే జగన్ సున్నితంగా రిజెక్ట్ చేస్తున్నారట. అయితే, ఇలాంటి వార్తల్లో నిజంలేదనే వారు కూడా వున్నారు. ఏపీలో బలపడాలనుకుంటున్న బీజేపీ, అధికారపక్షంతో ఎలా చేతులు కలుపుతుందన్నది వారి లాజిక్. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇప్పటికిప్పుడు టీడీపీని పక్కకునెట్టి, తాము ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలేమన్నది బీజేపీలోనే కొందరి భావన. అందుకే రానున్నది సంకీర్ణకాలమే కాబట్టి, ముందస్తు స్నేహం మంచిదేనంటున్నారు. ఆ నేపథ్యంలోనే కేబినెట్ ఆఫర్లంటున్నారు కొందరు విశ్లేషకులు. చూడాలి, మున్ముందు ఏం జరగబోతోందో.