Corona Third Wave: థర్డ్ వేవ్ ముప్పు లేనట్లేనా?
*ఒకవేళ వచ్చినా.. తీవ్ర స్థాయిలో ఉండదా? *రెండో ఉధృతి స్థాయిలో ఉండదంటున్న నిపుణులు *దేశంలో జోరందుకున్న వ్యాక్సినేషన్
Corona Third Wave: కొత్త కొత్త వేరియంట్లతో కొవిడ్ మహమ్మారి విరుచుకుపడుతోంది. సెకండ్ వేవ్‌తో జనజీవనాన్ని ఛిద్రం చేసిన కొవిడ్ మహమ్మారి దేశంలో ఇక తగ్గుముఖం పట్టినట్లేనా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. కరోనా దూకుడుకు ఫుల్‌స్టాప్ పడినట్లేనన్న ఆరోగ్యరంగ నిపుణుల అంచనాలతో శుభసూచనలు కనిపిస్తున్నాయి. రెండో ఉధృతి సమయంలోనే దేశంలో ఎక్కువ మందికి కరోనా సోకింది.
తర్వాత నుంచి వ్యాక్సినేషన్ పంపిణీ శరవేగంగా సాగుతుండటం, కరోనా యాంటీబాడీలు అభివృద్ధి చెందడం వంటివి ఇందుకు దోహదపడుతున్నాయని నిపుణులు తెలిపారు. కరోనా నుంచి కోలుకొని, తర్వాత టీకా కూడా తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతోందని.. అది కూడా ధర్డ్ వేవ్ నివారణలో అత్యంక కీలకంగా పనిచేస్తోందని వివరించారు.
దసరా, దీపావళి వంటి పండుగ సమయాల్లో ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశాలు ఉండటంతో ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్‌లో భారత్‌లో మూడో వేవ్ ఉంటుందని చాలామంది నిపుణులు అంచనావేశారు. అయితే పండుగల సీజన్ ముగిసిన తర్వాత కూడా కొత్త కేసులు అత్యల్ప స్థాయిలోనే నమోదవుతున్నాయి. దేశంలో రోజువారీ కొత్త కేసుల సంఖ్య 46 రోజులుగా 20వేలకు దిగువనే ఉంది. మరోవైపు శీతాకాలం ఆరంభమైన నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.
డిసెంబర్ చివరి నుంచి ఫిబ్రవరి వరకు దేశంలో కొవిడ్ కేసులు పెరిగే అవకాశముందని నిపుణులు అంటున్నారు. అయితే సెకండ్ వేవ్ స్థాయిలో పరిస్థితులు తీవ్రంగా ఉండవని చెబుతున్నారు. మరింత వేగంగా విస్తరించే వేరియంట్ పుట్టుకొస్తే తప్ప.. దేశానికి థర్డ్ వేవ్ ముప్పు తప్పినట్లేనని సోనిపట్‌లోని అశోక విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ గౌతమ్ మేనన్ తెలిపారు. ఇదిలా ఉంటే భారత్‌లో థర్డ్ వేవ్ ఉధృతి ఇప్పటికే వచ్చి, సెప్టెంబర్‌లోనే ముగిసి ఉండొచ్చని మరికొంతమంది నిపుణులు అంచనా వేశారు.