మొన్న ఢిల్లీ.. నేడు పంజాబ్.. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలకు ఆప్‌కు అస్త్రాలు
Punjab Election Results: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సునామీని సృష్టించింది.
Punjab Election Results: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ సునామీని సృష్టించింది. ఢిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చి ఆప్ పంజాబ్‌లోనూ కాంగ్రెస్‌ను చీపురు పూర్తిగా ఊడ్చేసింది. సంప్రదాయ పార్టీలతో విసిగిపోయిన పంజాబ్ ప్రజలు ఆప్ సంక్షేమ పథకాలు ఆకర్షించాయి. విద్య, ఆరోగ్యం, ఉద్యోగ కల్పన, ఉచితంగా విద్యుత్, మహిళలకు ఆర్థిక ప్రోత్సాహం లాంటి హామీలు ఇవ్వడంతో ప్రజుల చీపురుకే జైకొట్టారు.
పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలన విజయాన్ని సాధించింది. దేశ రాజధానిలో వరుస విజయాలను సాధించిన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పంజాబ్‌లో విజయంతో తన సత్తాను చాటింది. గెలుపు కోసం ఆమ్ ఆద్మీ ఆలపించిన సంక్షేమ రాగానికి ప్రజలు జైకొట్టారు. కాంగ్రెస్ అవినీతి పాలన, ఆ పార్టీ అంతర్గత కుమ్ములాటతో విసిగిపోయిన పంజాబ్ వాసులకు ఆప్ కొత్త భరోసాను ఇచ్చింది. విద్య, ఆరోగ్యం, ఉద్యోగ కల్పన, ఉచిత విద్యుత్ వంటి హామీలతో పాటు పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేస్తామని ఆప్ తన మేనిఫెస్టోతో నమ్మకం కలిగించింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపిస్తే ఢిల్లీ తరహాలో పాలను అందిస్తామని కేజ్రీవాల్ పదేపదే చెప్పారు. మౌలిక వసతులకు ప్రాధాన్యమిస్తామని ప్రజలను మెప్పించారు. రాష్ట్రంలో శాంతిని నెలకోల్పోయి.. అవినీతిని అంతం చేస్తామని హామీలు ఇచ్చారు. 18 ఏళ్ల దాటిన మహిళలకు నెలనెలా వెయ్యి రూపాయలు ఇస్తామని రైతు సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పంజాబ్‌లోని ప్రధాన పార్టీలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని ఆప్ అందిపుచ్చుకుంది. అంతేకాకుండా అధికార కాంగ్రెస్‌పై వ్యతిరేకత, శిరోమణి అకాలిదల్ కోలుకోలేకపోవడం ఆప్‌కు కలిసొచ్చింది. పైగా ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మాన్ ప్రజలను ఆకట్టుకోవడంలో సఫలం అయ్యారు. దీంతో పంజాబ్‌లో కాంగ్రెస్‌ను చీపురు క్లీన్ చేసింది.
2017 ఎన్నికల్లో కేవలం 20 స్థానాలతో పంజాబ్ అసెంబ్లీలో ఆప్ అడుగుపెట్టింది. నాటి నుంచి అధికార కాంగ్రెస్ పార్టీని ముప్పుతిప్పలు పెట్టింది. అంతేకాకుండా ఆప్‌కు చెందిన సగం మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం డీలా పడలేదు. క్షేత్రస్థాయిలో పార్టీపై ఓటర్లకు నమ్మకం కలిగించేందుకు ఆమ్ ఆద్మీ తీవ్రంగా శ్రమించింది. అంతేకాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికకు ప్రజాభిప్రాయాన్ని సేకరించడం ఆప్‌కు కలిసొచ్చింది. ప్రజలు ఎంపిక చేసిన రాష్ట్ర కన్వీనర్ భగవంత్ మాన్‌ను పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కేజ్రీవాల్ ప్రకటించడంతో పంజాబ్ ఆప్‌కు మరింత ఊపుతెచ్చింది.
117 స్థానాలున్న పంజాబ్‌లో 80కి పైగా స్థానాలను సాధించి.. ఆప్ అధికారాన్ని చేజిక్కించుకుంది. పంజాబ్ రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా తాము ఉన్నామంటూ సరికొత్త సమీకరణలకు ఆప్ తెరతీసింది.