Suez Canal: హమ్మయ్య ఎట్టకేలకు కదిలిన 'ఎవర్ గివెన్'
Suez Canal: సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ కంటైనర్ నౌక 'ఎవర్ గివెన్' ఎట్టకేలకు కదిలింది.
Suez Canal: సూయిజ్ కాలువలో ఇరుక్కుపోయిన భారీ కంటైనర్ నౌక సుమారు ఆరు రోజుల ప్రత్నాలు తరువాత 'ఎవర్ గివెన్' ఎట్టకేలకు కదిలింది. ఓడ ముందుభాగం కూరుకుపోయిన చోట ఇసుక, బంకమట్టిని డ్రెడ్జర్లు తవ్వుతూ నౌక కింద నీటిని పంప్ చేశారు. వీటికి సముద్రపు పోటు కూడా తోడైంది. దీంతో ఓడ తొలుత పాక్షికంగా, ఆ తర్వాత పూర్తిగా నీటిపై తేలి... ప్రస్తుతం దీని ప్రయాణం సాఫీగా సాగుతోందని మారిటైమ్ సర్వీసెస్ ప్రొవైడర్ ఇంచ్ కేప్ వెల్లడించింది. ఇందుకోసం 18 మీటర్ల లోతులో దాదాపు 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. గత మంగళవారం ఇసుక తుపాను, భారీ గాలుల కారణంగా ఎవర్ గివెన్ అడ్డం తిరిగి, దాని ముందుభాగాన ఉన్న కొమ్ము కాలువకు ఓ చివరన ఇసుక, బంకమట్టిలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. కాగా- ''పుల్-పుష్ ప్రయత్నాలకు ఎవర్ గివెన్ బాగా స్పందించింది. అడ్డంగా ఉన్న ఈ నౌకను 80% సాధారణ స్థితికి తీసుకొచ్చాం. తర్వాత పూర్తిగా నీటిపై తేలింది'' అని సూయిజ్ కెనాల్ అథారిటీ అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రబీ తెలిపారు.
ఈ కాలువ వద్ద ప్రస్తుతం 367 వాణిజ్య నౌకలు స్తంభించిపోయాయి. ఇవన్నీ చమురు, సరకులు, పశువులను తరలిస్తున్నవే. సమస్య పరిష్కారమైనప్పటి నుంచి ఈ నౌకలన్నీ కాలువ దాటడానికి కనీసం పది రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇసుక, బంకమట్టిలో కూరుకుపోయిన కారణంగా నౌక ఏమైనా దెబ్బతిందా అన్నది పరిశీలిస్తారు. అవసరమైతే మరమ్మతులు చేపట్టి... ఇప్పటికే వెళ్లాల్సి రోటెండమ్‌కే దాన్ని తీసుకువెళ్తామని యాజమాన్య సంస్థ చెబుతోంది. ఎవర్ గివెన్‌ను ప్రస్తుతం 'గ్రేట్ బిట్టర్ లేక్' వైపు తీసుకెళ్తున్నారు.