Manipur Violence: రగులుతున్న మణిపూర్‌.. సీఎం ఇంటిపై దాడి.. గాల్లో కాల్పులు జరిపి చెదరగొట్టిన పోలీసులు

Manipur Violence: సీఎం బీరెన్ సింగ్ ఇంటి ముట్టడికి ఆందోళనకారుల యత్నం.. గాల్లో కాల్పులు జరిపి చెదరగొట్టిన పోలీసులు

Update: 2023-09-29 02:43 GMT

Manipur Violence: రగులుతున్న మణిపూర్‌.. సీఎం ఇంటిపై దాడి.. గాల్లో కాల్పులు జరిపి చెదరగొట్టిన పోలీసులు

Manipur Violence: జాతుల మధ్య వైరంతో గత కొన్ని నెలలుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌ అట్టుడుకుతోంది. కొద్ది నెలల క్రితం అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు దారుణ హత్యకు గురయ్యారని తెలియడంతో మళ్లీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇప్పటికే వీరి హత్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌కు చెందిన పూర్వీకుల ఇంటిపై దాడిచేసేందుకు అల్లరి మూక ప్రయత్నించింది. ఇంఫాల్‌ శివారులో పోలీసుల పర్యవేక్షణలో ఖాళీగా ఉంటున్న బీరెన్‌ సింగ్‌కు చెందిన ఇంటిపై గురువారం రాత్రి దుండగులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు గాల్లో కాల్పులు జరిపి వారిని అడ్డుకున్నారు.

సీఎం సొంత ఇంటిపై దాడిచేసేందుకు రెండు గ్రూపులు వేర్వేరు మార్గాల్లో వచ్చేందుకు ప్రయత్నించాయని, అయితే దుండగులను 150 మీటర్ల దూరం నుంచే అడ్డుకున్నట్లు ఓ పోలీస్‌ అధికారి తెలిపారు. ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ టియర్‌ గ్యాస్ ప్రయోగించిందని, రాష్ట్ర పోలీసులు గాల్లో కాల్పులు జరిపి అల్లరిమూకను చెల్లాచెదురు చేశారని చెప్పారు. దుండగుల చర్యను కట్టడిచేసే క్రమంలో సీఎం నివాస ప్రాంతంలో పోలీసులు విద్యుత్‌ సరఫరాను ఆపేశారు. మరిన్ని బ్యారీకేడ్‌లతో మోహరించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సీఎం నివాసానికి సమీపంలో ఉన్న రోడ్డుపై నిరసనకారులు టైర్లను తగులబెట్టారు. ఇద్దరు విద్యార్థుల దారుణ హత్యకు నిరసనగా మణిపుర్‌లో మళ్లీ మొదలైన ఆందోళనలు గురువారం ఉదయం మరింత ఉద్ధృత రూపం దాల్చాయి.

యువతీ, యువకుడి హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించినప్పటికీ వారి మృతదేహాల జాడ తెలియరాలేదు. దీంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలను చివరి సారి చూడాలనుకుంటున్నామని వేడుకుంటున్నారు. మరోవైపు ఇంఫాల్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. స్టూడెంట్లు రోడ్లపైకి వచ్చి శాంతియుత నిరసన తెలియజేస్తున్నారు. అయితే ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీంతో నిరసనలు ఇతర చోట్లకు వ్యాపించకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. CRPF, RAF బలగాలను రంగంలోకి దించింది.

మరోవైపు జమ్మూకశ్మీర్‌లోని ముష్కర మూకల దాడులను నిరోధించడంలో నిపుణుడిగా పేరున్న శ్రీనగర్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రాకేశ్‌ బల్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం మణిపుర్‌కు బదిలీ చేయనుంది. శ్రీనగర్‌లో శాంతిభద్రతలను అదుపులోకి తీసుకురావడంలో ఆయన సఫలమయ్యారు. 2012 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన బల్వాల్‌ను 2021 డిసెంబరులో అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంత ఉమ్మడి కేడర్‌కు ప్రభుత్వం మార్చింది. తాజాగా కేంద్ర హోంశాఖ ప్రతిపాదన మేరకు ఆయనను మణిపుర్‌ కేడర్‌కు తీసుకొచ్చేందుకు కేబినెట్‌ నియామకాల కమిటీ అంగీకరించిందని పేర్కొంటూ అధికారిక ప్రకటన వెలువడింది.

Tags:    

Similar News