Heart Breaking Incident: అంబులెన్స్ కు డబ్బులు లేక.. బ్యాగులో మృతదేహం.. 200 కిలోమీటర్ల ప్రయాణం..

* అయిదు నెలల కుమారుడి మృతదేహాన్ని అంబులెన్స్ లో తీసుకెళ్లేందుకు డబ్బులు లేక ఓ తండ్రి నిస్సహాయ పరిస్థితిలో బస్సులో ప్రయాణం అయ్యాడు. *మృతదేహాన్ని బ్యాగులో దాచి 200 కిలోమీటర్లు ప్రయాణించాడు..

Update: 2023-05-16 10:30 GMT

Heart Breaking Incident: అంబులెన్స్ కు డబ్బులు లేక.. బ్యాగులో మృతదేహం.. 200 కిలోమీటర్ల ప్రయాణం..

Heart Breaking Incident: ఓవైపు కుమారుడు చనిపోయాడనే బాధ..మరోవైపు మృతదేహాన్ని తరలించేందుకు డబ్బులేని దీనస్థితి...చేసేది లేక చిన్నారి మృతదేహాన్ని బ్యాగ్ లో పెట్టుకొని 200 కిలోమీటర్ల మేర బస్సులోనే ప్రయాణించాడు ఆ నిస్సహాయ తండ్రి..హృదయాన్ని కలిచివేసే ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...ఉత్తర్ దినాజ్ పూర్ జిల్లా కలియాగంజ్ ప్రాంతానికి చెందిన అసిమ్ దేవశర్మ వలస కార్మికుడు. ఇతడికి ఇద్దరు కవల పిల్లలు. వీరిద్దరూ అనారోగ్యానికి గురి కావడంతో శిలిగుడిలోని ఉత్తర బెంగాల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించాడు. అక్కడ కవలల్లో ఒకరి ఆరోగ్యం మెరుగు పడగా...ఆ చిన్నారిని దేవశర్మ భార్య ఇంటికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతున్న మరో కుమారుడి వద్ద దేవశర్మ ఉన్నాడు. ఆ చిన్నారి ఆరోగ్యం క్షీణించడంతో గత శనివారం చనిపోయాడు. దీంతో బిడ్డ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్ కోసం వెళ్లగా డ్రైవర్లు రూ.8,000 డిమాండ్ చేశారు. అయితే అంత డబ్బు దేవశర్మ వద్ద లేదు. తన వద్ద ఉన్న రూ.16,000లను పిల్లల వైద్యానికే ఖర్చు చేసేశాడు. దీంతో చేసేది లేక బిడ్డ మృతదేహాన్ని బ్యాగులో ఉంచి బస్సులో ప్రయాణించాడు.

బిడ్డ మరణించాడని పుట్టెడు దు:ఖాన్ని దిగమింగుతూ అసిమ్ దేవశర్మ..చిన్నారి మృతదేహాన్ని బ్యాగులో దాచి తన ఊరి బసెక్కాడు. అలా 200 కిలోమీటర్లు ప్రయాణించి కలియాగంజ్ చేరుకున్నాడు. అక్కడ తనకు తెలిసినవారికి విషయం చెప్పగా...వారు చందాలు వేసుకొని అంబులెన్స్ ఏర్పాటు చేశారు. అలా కుమారుడి మృతదేహంతో దేవశర్మ తన నివాసానికి చేరుకున్నాడు. అనంతరం కుటుంబసభ్యులు, స్థానికుల సహకారంతో చిన్నారికి అంత్యక్రియలు చేశాడు.

Tags:    

Similar News