Mamata Banerjee: దాడి తర్వాత తొలిసారి మాట్లాడిన మమత
Mamata Banerjee: టీఎమ్‌సీ కార్యకర్తలు సంయమనం పాటించాలి. ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని మమత అన్నారు.
Mamata Banerjee: అసెంబ్లీ ఎన్నికల వేళ నందిగ్రామ్ అటాక్... బెంగాల్ పాలిటిక్స్‌ను కుదిపేస్తోంది. మమతా బెనర్జీపై దాడి మంటలు పుట్టిస్తోంది. అనేక మలుపులు తిరుగుతూ హాలీవుడ్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ప్రధానంగా బీజేపీ, టీఎంసీ మధ్య ఫైట్ పీక్స్‌కు చేరింది.
ఓవైపు నిరసనలు.. మరోవైపు ఈసీకి ఫిర్యాదులతో బెంగాల్ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. మమతపై జరిగిన దాడిపై అటు అధికార టీఎంసీతోపాటు ఇటు బీజేపీ కూడా... ఈసీకి ఫిర్యాదు చేశాయి. దాంతో, రేపటిలోగా దాడి ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని పశ్చిమబెంగాల్ సీఎస్‌ను ఈసీ ఆదేశించింది.
మరోవైపు మమతపై బీజేపీనే దాడి చేసిందంటూ టీఎంసీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై టైర్లు తగలపెట్టి నిరసన తెలిపారు. టీఎంసీ ఆందోళనలపై స్పందించిన దీదీ... ఆస్పత్రి బెడ్ పైనుంచే తమ కార్యకర్తలకు సందేశమిచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగనివ్వొద్దని, శాంతియుతంగా ఉండాలని కోరారు. ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశారు.
దాడి తర్వాత ఆస్పత్రి బెడ్‌పై నుంచి తొలిసారి మాట్లాడిన మమతాబెనర్జీ.... తనను నిర్మూలించే కుట్ర జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు. కారు దగ్గర నిల్చున్న తనను వెనుక నుంచి తోసేశారని అన్నారు. ఐదుగురు తనపై దాడికి పాల్పడటంతో ఛాతికి, చేతికి, కాలికి గాయాలు అయ్యాయని అన్నారు. రెండు మూడ్రోజుల్లోనే కోలుకుని ప్రచారంలో పాల్గొంటానన్న మమత.... వీల్ చైర్ సాయంతో క్యాంపైన్ చేస్తానన్నారు.
హెల్త్ బులెటిన్ ప్రకారమైతే మమత కదల్లేని స్థితికి చేరుకున్నారు. అడుగు తీసి కింద పెట్టలేని స్థితిలో ఉన్నారామె. ఛాతినొప్పితోపాటు శ్వాస తీసుకోవడంలో మమత ఇబ్బందులు పడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆమె ఎడమకాలుతోపాటు కుడిభుజం, మెడకు తీవ్ర గాయాలయ్యాయని.. మరో 48 గంటలపాటు మమతా వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మమతకు రెండు నెలల విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు.