Bengal: బెంగాల్‌లో రసవత్తరంగా మారిన ఎన్నికలు
Bengal: మమతా బెనర్జీ వర్సెస్ సువేందు అధికారి * నందిగ్రామ్ నుంచి పోటీలో దిగుతున్న దీదీ
Bengal: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఉత్కంఠను రేపుతున్నాయి. ఈ ఎన్నికలను అటు తృణమూల్ కాంగ్రెస్, ఇటు బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ.. ప్రచారపర్వాన్ని ముమ్మరం చేశాయి. పెద్ద ఎత్తున ర్యాలీలు చేపడుతూ బహిరంగ సభలను నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. అయితే.. ఈ సారి జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో సెంట్రాఆఫ్ అట్రాక్షన్‌గా నిలవనుంది నందిగ్రామ్. అందరి దృష్టి ఈ స్థానంపై పడింది. అసలు నందిగ్రామ్‌పై ఫోకస్ ఎందుకు పెట్టారు.
294 శాసనసభ స్థానాలున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఈ సారి ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మూడు దశబ్దాల పాటు ఇంకొకరికి చాన్స్ ఇవ్వకుండా పాలించిన సీపీఎంను గద్దే దింపి. మమత బెనర్జీ సీఎం పీఠంపై కూర్చుంది. అయితే.. ఇప్పుడు ఆమెను దింపి బీజేపీ గద్దనెక్కేందుకు ప్రయత్నిస్తోంది. అందుకోసం తృణమూల్ కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థులను తమపార్టీలో చేర్చుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే బెంగాల్ వేదికగా బీజేపీ రాజకీయం నడిపింది.
సవాళ్లు, ప్రతి సవాళ్లు విమర్శలు, ప్రతి విమర్శలు.. రాక్షసులు, దేవుళ్లు అంటూ రాజకీయం రసవత్తరంగా మారింది. దాంతో బెంగాల్ వాడలు మార్మోగుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కేంద్ర హోం మంత్రి రంగంలోకి దిగి మరి ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పుడు దీదీ పోటీ చేయబోయే నందిగ్రామ్ నియోజకవర్గ పోరు ఆసక్తికరంగా మారింది. నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని మమత బీజేపీకి గత కొన్ని రోజుల క్రితమే సవాల్ చేశారు దీంతో దీదీకి గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ కీలక నేత సువేందును ఆ స్థానం నుంచే దించాలని ప్లాన్స్ వేస్తోంది. నందిగ్రామ్ వేదికగా మమతా వర్సెస్ సువేందుగా మారింది.
ఎన్నికల ముందే సువేందు తృణమూల్‌ను వీడి బీజేపీలో చేరారు ఆయనకు, ఆయన కుటుంబానికి నందిగ్రామ్, జంగల్‌మహల్ ప్రాంతాల్లో గట్టి పట్టుంది. బీజేపీలో చేరకముందు వరకు ఆయన నందిగ్రామ్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు సువేందు అధికారి పార్టీ మారడంతో దీదీకి ఆ నియోజకవర్గంలో బలం కోల్పోయినట్లయింది. కానీ, దీదీ మాత్రం నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తానని బీజేపీకి సవాల్ విసిరారు.
అయితే దీదీ చేసిన సవాల్‌ను సువేందు అధికారి స్పందించారు. నందిగ్రామ్ నుంచి మళ్లీ బరిలోకి దిగేందుకు తాను సిద్దమేనని ప్రకటించారు. అంతేకాదు.. దీదీని 50 వేలకు పైగా ఓట్లతో ఓడిస్తానని, విజయం సాధించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సువేందు మమతాకు సవాల్ చేశారు. దీంతో ఈ నియోజకవర్గం ఉత్కంఠగా మారింది. అంతేకాదు.. ఈ స్థానం నుంచి గెలిచిన వారు బెంగాల్ సీఎం అయ్యే చాన్స్ కూడా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో భవానీపూర్ నుంచి పోటీ చేసిన మమత బెనర్జీ ఈ సారి ఒక్క నందిగ్రామ్ నుంచి పోటీ చేయనునట్లు ప్రకటించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఏ స్థానానికి లేని క్రేజ్ నందిగ్రామ్‌పై పడింది. దీదీ ఈ నెల 11న నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయనున్నారు. అయితే.. తాను ఇంతకు ముందు ప్రాతినిధ్యం వహించిన భవానీపూర్ ప్రజలు బాధపడొద్దని, వారికి మంచి అభ్యర్దిని ఇస్తానని మమతా అన్నారు.
పదేళ్ల క్రితం బెంగాల్‌లో అధికారం లెఫ్ట్ పార్టీల నుంచి తృణమూల్ చేతికి రావడంలో నందిగ్రామ్ ఉద్యమం కీలక పాత్ర పోషించింది. మరి అలాంటి కీలక స్థానం నుంచి దీదీ విజయం సాధించగలరా..? విజయం సాధించి హ్యట్రిక్ కొడతారా? అనేది తెలియాలంటే మే 2 వరకు వేచి చూడాల్సిందే.